కలం, ఆదిలాబాద్: నార్నూర్ ఆస్పిరేషనల్ బ్లాక్ పరిధిలో సమగ్ర అభివృద్ధిని సాధించి, ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా (Rajarshi Shah) ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నార్నూర్ ఆస్పిరేషనల్ బ్లాక్ అభివృద్ధి, పురోగతిపై వివిధ శాఖల అధికారులతో ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్లాక్ పరిధిలో నిర్ణయించిన కీలక పనితీరు సూచికల సాధనలో ఇప్పటివరకు సాధించిన ప్రగతిని శాఖల వారీగా కలెక్టర్ క్షుణ్ణంగా సమీక్షించారు. విద్యా, వైద్యం, పోషకాహారం, వ్యవసాయం, మౌలిక వసతుల రంగాల్లో నిర్దేశించుకున్న లక్ష్యాలను శరవేగంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
పాత ప్రాజెక్టుల అమలులో ఎదురవుతున్న సాంకేతిక, పరిపాలనాపరమైన ఇబ్బందికర అంశాలను తక్షణమే పరిష్కరించి పనులను వేగవంతం చేయాలని, కొత్తగా మంజూరైన పనులను ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. మారుమూల గ్రామాలు, గిరిజన ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు సకాలంలో, పారదర్శకంగా అందాలని ఉద్ఘాటించారు. ఇందుకోసం అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీఓ మంద మకరంద్, డీఆర్డీఓ రవీందర్ రాథోడ్, డీఎంహెచ్ఓ సాధన, సంక్షేమ శాఖ అధికారి మిల్కా తదితర జిల్లా స్థాయి అధికారులు, నీతి ఆయోగ్ ప్రోగ్రామ్ అధికారి రాహుల్, వివిధ సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.

