కలం, బైంసా: బైంసా (Bhainsa) పట్టణంలో దుర్గామాత నిమజ్జనోత్సవం భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రశాంతంగా ముగిసింది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని వివిధ మండపాల్లో ప్రతిష్ఠించిన దుర్గామాత విగ్రహాలను భక్తిశ్రద్ధలతో శోభాయాత్రగా తరలించి, గడ్డన్న ప్రాజెక్టు వద్ద నిమజ్జనం చేశారు. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా ఎస్పీ జానకి షర్మిల, భైంసా ఏఎస్పీ సాయికిరణ్ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
శోభాయాత్ర మార్గాల్లో భద్రతా చర్యలు చేపట్టి, నిమజ్జన కార్యక్రమం సజావుగా జరిగేలా అధికారులు పర్యవేక్షించారు. ఉత్సవాలు ప్రశాంతంగా ముగియడంలో సమర్థవంతంగా విధులు నిర్వహించిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. నిమజ్జనోత్సవం ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన భక్తులు, మండపాల నిర్వాహకులు, పట్టణ ప్రజలకు జిల్లా పోలీసు శాఖ కృతజ్ఞతలు తెలిపింది.

