కలం, ఖమ్మం బ్యూరో: కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సేవల విభాగం, జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రామ పంచాయతీ స్థాయి ప్రత్యేక ఆర్థిక అవగాహన శిబిరాలు (Financial Awareness Camps) ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా గురువారం జూలూరుపాడు మండలం అనంతారం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో తొలి శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో బ్యాంకులు అందిస్తున్న వివిధ సేవలతో పాటు కేవైసీ అప్డేట్ చేసుకోవడం, ఉపయోగంలో లేని ఖాతాల పునరుద్ధరణ వంటి అంశాలపై గ్రామీణులకు అవగాహన కల్పించారు.
అలాగే ప్రధాన మంత్రి జీవన జ్యోతి భీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష భీమా పథకం, అటల్ పెన్షన్ యోజన వంటి వివిధ భీమా, పింఛన్ పథకాల గురించి వివరించారు. డిజిటల్ లావాదేవీల అవశ్యకతను తెలియజేస్తూ, సైబర్ మోసాలకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మోసం జరిగితే తక్షణ సహాయం కోసం 1930 టోల్ ఫ్రీ నంబర్ వినియోగంపై అవగాహన కల్పించారు. కిసాన్ క్రెడిట్ కార్డు, క్లెయిమ్ చేయని డిపాజిట్లు-వాటిని తిరిగి తీసుకునే విధానం, రుణాల సక్రమ చెల్లింపు ప్రయోజనాలు మరియు నామినేషన్ సౌకర్యం తదితర వివరాలను ప్రజలకు తెలియజేసి వారి సందేహాలను నివృత్తి చేశారు.
ఈ సందర్భంగా కస్టమర్ సర్వీస్ పాయింట్ సిబ్బంది ఆసక్తి గల ఖాతాదారులకు భీమా పథకాలలో నమోదు చేసి ధ్రువపత్రాలు అందజేశారు. డిసెంబర్ 31 లోగా జిల్లాలోని (Bhadradri Kothagudem) ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం ఒక శిబిరం నిర్వహించేలా అన్ని బ్యాంక్ శాఖలు, ప్రభుత్వ శాఖల సమన్వయంతో కృషి చేస్తున్నట్లు లీడ్ బ్యాంక్ మేనేజర్ రామిరెడ్డి తెలిపారు. ఈ శిబిరాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

