ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి: కలెక్టర్ రిజ్వాన్

కలం, జోగులాంబ‌ గద్వాల: ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ (Rizwanbasha Shaik) వైద్య శాఖ అధికారులకు ఆదేశించారు. గురువారం మల్దకల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు తదితర విషయాలపై వైద్య సిబ్బందిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆసుపత్రికి వచ్చే ఔట్ పేషెంట్లకు పూర్తిస్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆసుపత్రిలో వైద్యులు, వైద్య సిబ్బంది సమయపాలన పాటిస్తూ విధులకు క్రమం తప్పకుండా నిర్వహించాలని ఆదేశించారు. ఆరోగ్య కేంద్రం పరిధిలో స‌హ‌జ ప్రసవాల సంఖ్య పెంచేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని,హై రిస్క్ గర్భిణీలను ముందుగానే గుర్తించి, తగిన వైద్య జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

గర్భిణీల ఏఎన్‌సీ రిజిస్ట్రేషన్, చెక‌ప్ వంద శాతం జరిగేలా చూడాలన్నారు. ఆసుపత్రిలోని అన్ని రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని, వర్షాకాలంలో ఎలాంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు, ఇతర పరీక్షలను వేగంగా పూర్తి చేసి తక్షణ రోగ నిర్ణయం చేయాలని అన్నారు. అవసరమైన మందులు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకోవాలని వైద్యులకు సూచించారు. కుక్క కాటు, పాము కాటు బాధితులకు తక్షణ వైద్య సేవలు అందించేలా అవసరమైన మందులు, వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోపల, బయట పరిశుభ్రతను నిరంతరం పాటిస్తూ, రోగులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలన్నారు. గర్భిణీ స్త్రీల కోసం ఏర్పాటు చేస్తున్న యోగా కేంద్రం భవన నిర్మాణం పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి చేయాలని, వైద్య అధికారులు, సిబ్బంది తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ స్వరూప రాణి, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>