దిలీప్ గవిత్‌కు స్వర్ణం

కలం, స్పోర్ట్స్​ : ఆసియా పారా గేమ్స్‌లో భారత అథ్లెట్ దిలీప్ మహాడు గవిత్ (Dilip Gavit) సరికొత్త సంచలనం సృష్టించారు. బుధవారం నాగోయాలో జరిగిన పురుషుల 100 మీటర్ల T47 ఫైనల్‌లో ఆయన పసిడి పతకాన్ని ముద్దాడారు. పోటీ చివరి క్షణాల్లో అత్యంత వేగంగా పుంజుకుని రేసును అగ్రస్థానంలో ముగించారు. ఈ రేసులో దిలీప్ 10.69 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకున్నారు. ఆయన కంటే స్వల్ప తేడాతో వెనుకబడిన భారత అథ్లెట్ మహమ్మద్ మోర్సింగనకత్ 10.72 సెకన్లతో రజతం గెలుచుకున్నారు. చైనాకు చెందిన కాంగ్‌జున్ షి 10.80 సెకన్లతో కాంస్య పతకంతో సరిపెట్టుకున్నారు.

దిలీప్ గవిత్ కెరీర్ తొలినాళ్లలో 400 మీటర్ల పరుగుపందెంలో రాణించారు. 2022 హాంగ్‌జౌ ఆసియా పారా గేమ్స్‌లో ఆయన 400 మీటర్ల విభాగంలో పసిడి పతకం సాధించారు. ఆ తర్వాత గ్లాస్గో కామన్‌వెల్త్ గేమ్స్ షెడ్యూల్ నుంచి 400 మీటర్ల ఈవెంట్‌ను తొలగించారు. దాంతో ఆయన 100 మీటర్ల పరుగు వైపు దృష్టి సారించారు. కొత్తగా ఎంచుకున్న 100 మీటర్ల ఈవెంట్‌లోనూ దిలీప్ వరుస విజయాలు సాధించారు. గ్లాస్గో కామన్‌వెల్త్ గేమ్స్‌లో పసిడి పతకం గెలిచి తన సత్తా చాటారు.

ఇప్పుడు నాగోయా ఆసియా పారా గేమ్స్‌లోనూ అదే ప్రదర్శనను పునరావృతం చేసి వరుసగా రెండో అంతర్జాతీయ గోల్డ్ మెడల్ సాధించారు. మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో ఒక గ్రామంలో దిలీప్ జన్మించారు. ఆయనకు నాలుగేళ్ల వయస్సు ఉన్నప్పుడు జరిగిన ప్రమాదంలో ఎడమ చేయి తీవ్రంగా గాయపడింది. గ్రామీణ ప్రాంతంలో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో ఆ చేయిని తీసివేయాల్సి వచ్చింది. ఆర్ధిక ఇబ్బందులు, క్రీడా వసతులు లేని వాతావరణంలో ఆయన పెరిగారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>