కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలోని బూర్గంపాడు, టేకులపల్లి, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాలలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ వరుస ఘటనలతో ఆయా ప్రాంతాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన కేసుపాక నవీన్ (20) మణుగూరులోని తన స్నేహితుడి ఇంటికి వచ్చాడు. దసరా పండుగ సందర్భంగా సింగరేణి గ్రౌండ్లో జరిగిన జమ్మి వేడుకలను స్నేహితులతో కలిసి చూసి మంగళవారం అర్ధరాత్రి మోటార్ సైకిల్‌పై వస్తుండగా.. కోడిపుంజులవాగు బ్రిడ్జ్ (కూనవరం) దగ్గర రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళను వారి బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ వెనుక కూర్చున్న నవీన్ కింద పడిపోవడంతో తలకు బలమైన గాయాలై తీవ్ర రక్తస్రావమైంది. తొలుత మణుగూరు ఆసుపత్రికి, అక్కడి నుంచి భద్రాచలం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే నవీన్ మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
మరోవైపు టేకులపల్లి మండలం ఎర్రాయిగూడెం స్టేజ్ వద్ద బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రెండు బైకులు ఎదురెదురుగా వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎర్రాయిగూడెకు చెందిన వర్ష వీరస్వామికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వీరస్వామిని కొత్తగూడెం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో మరో వ్యక్తికి కూడా గాయాలైనట్లు సమాచారం కాగా, మృతుడి భార్య సారక్క ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇలా ఉండగా, బుధవారం అన్నపురెడ్డిపల్లి మండలం శాంతనగర్ వాసి పాయం శ్రీనివాసరావు యర్రగుంట సమీపంలోని రైల్వే ట్రాక్‌పై మృతి చెంది కనిపించడం స్థానికంగా కలకలం సృష్టించింది. సమాచారం అందుకున్న ఎస్ఐ విజయ్ సింహారెడ్డి వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితుడిని రైలు ఢీకొనడం వల్లనే మరణించి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్న పోలీసులు.. మృతదేహాన్ని తదుపరి చర్యల నిమిత్తం రైల్వే పోలీసులకు అప్పగించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా, మృతుల పూర్తి సమాచారం తెలియల్సి ఉంది.

