కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని సిద్ధాపూర్ – కౌట్ల (కె) గ్రామాల మధ్య నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన పేదలకు వెంటనే కేటాయించాలని డిమాండ్ చేస్తూ పలు కాలనీలకు చెందిన టోకెన్లు పొందిన లబ్ధిదారులు బుధవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ.. సుమారు రూ. 31.80 కోట్ల అంచనా వ్యయంతో 25 బ్లాకుల్లో 600 కుటుంబాల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇప్పటివరకు అర్హులకు కేటాయించకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వ హయాంలో అధికారులు సర్వే నిర్వహించి అర్హులైన వారికి టోకెన్లు సైతం అందజేశారని తెలిపారు. అయినప్పటికీ ఇళ్ల కేటాయింపులో జాప్యం జరుగుతోందని వాపోయారు. దసరా పండుగలోగా ఇళ్లను మంజూరు చేస్తామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు అమలు కాలేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అర్హుల జాబితాను పరిశీలించి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు. నిరుపేద కుటుంబాలకు సొంత ఇంటి కలను నెరవేర్చి న్యాయం చేయాలని కోరారు.

