నామినేటెడ్ పోస్టుల్లో నిరాశ..!

కలం, వనపర్తి : రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి దాదాపు మూడేళ్లు కావస్తున్న నేపథ్యంలో.. పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసిన కార్యకర్తలు, సీనియర్‌ నాయకులకు తగిన గుర్తింపు, అవకాశాలు కల్పించాలనే డిమాండ్‌ వనపర్తి జిల్లా కాంగ్రెస్‌ (Wanaparthy Congress) శ్రేణుల్లో వినిపిస్తోంది. ముఖ్యంగా నామినేటెడ్‌ పోస్టుల (Nominated Posts) భర్తీ, పార్టీ పదవుల కేటాయింపులో కష్ట కాలంలో పార్టీకి అండగా నిలిచిన వారికి ప్రాధాన్యం దక్కాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అవకాశాల కోసం ఎదురుచూపులు

పార్టీ అధికారంలోకి వస్తే తమకు తగిన గుర్తింపు లభిస్తుందని ఆశించిన పలువురు కార్యకర్తలు ఇంకా అవకాశాల కోసం ఎదురుచూస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే బాధ్యతలు నిర్వహిస్తున్న కొందరు నాయకులకు అదనపు పదవులు దక్కుతుండగా, దీర్ఘకాలంగా పార్టీ కోసం పనిచేసిన మరికొందరికి అవకాశాలు లభించడం లేదనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీ కోసం నిరంతరం పనిచేసిన పలువురు కార్యకర్తలు మాత్రం అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

పదవుల కేటాయింపులో సమతుల్యత పాటించాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. నామినేటెడ్‌ పోస్టులపై ఆశలు పెట్టుకున్న కార్యకర్తల నిరీక్షణ ఎండమావిలో నీటి కోసం ఎదురుచూసినట్లుగా మారిందనే వ్యాఖ్యలు కొందరి నుంచి వినిపిస్తున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ కష్టానికి గుర్తింపు లభిస్తుందని ఆశించిన వారు ఇప్పటికీ నిరీక్షణలోనే ఉండడం గమనార్హం. పార్టీ కోసం జెండా మోసిన వారికి రాజకీయ అవకాశాలతో పాటు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు దోహదపడే ఉపాధి అవకాశాలు కల్పించాలనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.

నాయకత్వం మరింత చేరువ కావాలి..!

ఇదే సమయంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడి అందుబాటు అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. జిల్లా కాంగ్రెస్‌ కమిటీ (డీసీసీ) నాయకత్వం క్షేత్రస్థాయి కార్యకర్తలకు మరింత అందుబాటులో ఉండాలనే అభిప్రాయాలు పార్టీ శ్రేణుల్లో ఉన్నాయి. పార్టీలో నమ్ముకున్న వారి కోసం, పార్టీ శ్రేణులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాల్సిన నాయకత్వం క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో మరింత మమేకం కావాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కార్యకర్తల సమస్యలను తెలుసుకోవడం, వారి అభిప్రాయాలకు ప్రాధాన్యమివ్వడం, తరచూ సమావేశాలు నిర్వహించడం, వారికి ధైర్యం చెప్పే వేదికలు, సమావేశాలు, వ్యక్తిగత భేటీలు పెరగాలని కోరుతున్నారు. తద్వారా పార్టీ శ్రేణుల్లో విశ్వాసాన్ని పెంపొందించవచ్చని పలువురు సూచిస్తున్నారు.

కార్యకర్తలతో వ్యక్తిగతంగా మమేకమై వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ శ్రేణుల అభిప్రాయాలను పరిశీలిస్తే.. వనపర్తి ఎమ్మెల్యే ప్రజలకు, మహిళలకు, పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటూ పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారనే అభిప్రాయమూ ఉంది. అభయహస్తం, ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు, ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవ చూపుతున్నారని కొందరు కార్యకర్తలు చెబుతున్నారు.

అయితే, స్థానికంగా కొందరి అభిప్రాయాలకే ప్రాధాన్యం దక్కుతోందని, పనుల విషయంలోనూ సమాన అవకాశాలు లభించడం లేదని మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయినప్పటికీ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశాలు, ప్రభుత్వ అనుబంధ పదవులు, ఉపాధి కల్పన వంటి అంశాలపై మరింత దృష్టి సారించాలని వారు కోరుతున్నారు. ఈ అభిప్రాయాలపై స్పష్టత రావాలంటే క్షేత్రస్థాయిలో కార్యకర్తల సమస్యలను సమగ్రంగా సమీక్షించాల్సిన అవసరం ఉంది.

పదవుల ప్రయోజనాలు క్షేత్రస్థాయికి చేరుతున్నాయా?

జిల్లాలో కాంగ్రెస్‌ నాయకులకు కీలక పదవులు, ప్రజాప్రతినిధులుగా అవకాశాలు లభించినప్పటికీ.. వాటి ద్వారా పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు ఎంతమేర ప్రయోజనం చేకూరుతోందనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ప్రభుత్వంలో ప్రాతినిధ్యం పెరిగినా నాయకుల చుట్టూ ఉండే కొందరికి మాత్రమే ప్రతిఫలాలు దక్కుతున్నాయనే వాదన ఒకవైపు ఉంటే, క్షేత్రస్థాయిలో కార్యకర్తల మనసులు గెలుచుకోవడంలో నాయకత్వం కొంత వెనుకబడినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నాయకులు ప్రభుత్వంలో అధికారులను సమన్వయం చేయడంలో కూడా పట్టు సాధించే అవసరం ఎంతైన ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ప్రభుత్వ శాఖల అధికారులతో ప్రజా సమస్యల పరిష్కారానికి మరింత చొరవ చూపాలని, ప్రభుత్వ పథకాల అమలులో కొందరు చెప్పిన వారికే కాకుండా అందరికీ ప్రయోజనం అందేలా చూడాలని పలువురు కోరుతున్నారు. నాయకత్వానికి చేరువగా ఉండే కొందరికే అవకాశాలు లభిస్తున్నాయనే భావన కార్యకర్తల్లో పెరిగితే పార్టీపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పదవులు ఉన్నవారికే మరిన్ని బాధ్యతలు దక్కుతున్నాయనే భావనకు బదులుగా.. పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

ఆత్మీయ సమావేశాలతో అసంతృప్తికి పరిష్కారం

కాంగ్రెస్ పార్టీ స్వభావం ప్రకారం ప్రతి కార్యకర్త నాయకుడిగానే భావించే సంస్కృతి ఉంటుంది. అలాంటి పార్టీలో కిందిస్థాయి కార్యకర్తల అభిప్రాయాలు, ఆశలు, ఆకాంక్షలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కష్ట కాలంలో పార్టీకి అండగా నిలిచిన సీనియర్‌ నాయకులు, నిబద్ధతతో పనిచేసిన కార్యకర్తలతో ప్రత్యేక ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని పలువురు సూచిస్తున్నారు. వారి సమస్యలు, ఆర్థిక పరిస్థితులు, రాజకీయ ఆకాంక్షలు, భవిష్యత్తులో కల్పించగల అవకాశాలపై సమీక్షలు చేపట్టి చర్చించాలని కోరుతున్నారు.

నామినేటెడ్‌ పోస్టులు (Nominated Posts) , వివిధ ప్రభుత్వ కమిటీలు, ఇతర బాధ్యతల కేటాయింపులో సమతుల్యత పాటిస్తూ అర్హత, పార్టీకి చేసిన సేవలను పరిగణనలోకి తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు. కార్యకర్తలే ఏ రాజకీయ పార్టీకైనా వెన్నెముక. వారి సేవలకు వారి కష్టానికి తగిన గుర్తింపు, గౌరవం తగిన అవకాశాలు కల్పించినప్పుడే పార్టీ సంస్థాగతంగా బలోపేతమవుతుందని స్పష్టమైన విషయం. క్షేత్రస్థాయిలో వ్యక్తమవుతున్న అభిప్రాయాలను నాయకత్వం పరిగణనలోకి తీసుకుని సమయానికి కార్యకర్తల సమస్యలు గుర్తించి పరిష్కారానికి చర్యలు చేపడితే భవిష్యత్తులో పార్టీ మరింత బలంగా ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయని.. పార్టీ శ్రేణుల్లో విశ్వాసం మరింత పెరిగే అవకాశం ఉందనీ విశ్లేషకులు, రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>