కలం, ఉట్నూర్ : ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ (Vedma Bhojju Patel ) అన్నారు. సోమవారం ఉట్నూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సేవల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ విభాగాలను సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది పనితీరు, అందుబాటులో ఉన్న సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం వైద్యాధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించి ఆసుపత్రిలోని సమస్యలు, వైద్య సేవల నిర్వహణపై చర్చించారు. వైద్యులు, వైద్య సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉంటూ రోగులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఆసుపత్రికి వచ్చే పేద, సామాన్య ప్రజల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ప్రతి రోగికి సకాలంలో వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

