కలం, కరీంనగర్ బ్యూరో: పంటలు వేయొద్దని చెప్పడానికి ప్రభుత్వానికి సిగ్గుండాలి. రైతులను వ్యవసాయం వద్దంటున్న ముఖ్యమంత్రి ముందుగా తన రాజకీయాలు బంద్ పెడతారా? అని తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kavitha) ప్రశ్నించారు. సోమవారం కరీంనగర్ రూరల్ మండలం మొగ్దుంపురం(Mogdumpur) గ్రామంలో సాగునీరు అందక ఎండిపోయిన పంటలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి, పంటలు ఎండిపోవడానికి దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కష్టకాలంలో ఉన్న రైతులకు ధైర్యం చెప్పి ఓదార్చారు.
ప్రభుత్వంపై కవిత తీవ్ర ఆగ్రహం
రైతులను పంటలు వేయవద్దని చెప్పే నైతిక హక్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని కవిత మండిపడ్డారు. గతంలో ఏ ప్రభుత్వమూ రైతులను పంటలు వేయవద్దని చెప్పలేదని గుర్తుచేశారు.
కాళేశ్వరం రాజకీయం.. ప్రాణహిత ప్రత్యామ్నాయం
కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తోందని కవిత ఆరోపించారు. ప్రాజెక్టు ఫెయిలైందా, పాసైందా అనే చర్చను పక్కనపెడితే.. అన్నదాతలను కాపాడే బాధ్యత ప్రభుత్వంపై లేదా అని ప్రశ్నించారు. ప్రాణహిత వద్ద చిన్న కాఫర్ డ్యామ్ నిర్మిస్తే 35 నుంచి 40 లక్షల ఎకరాల ఆయకట్టును సులభంగా స్థిరీకరించవచ్చని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి తన బేషజాలను పక్కనపెట్టి వెంటనే ఆ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
కరీంనగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని మొగ్దుంపురం(Mogdumpur)లో పంటలు ఎండిపోతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని కవిత విమర్శించారు. కనీసం ఒక్క అధికారైనా వచ్చి పంట నష్టాన్ని పరిశీలించారా అని నిలదీశారు. కలెక్టర్ స్వయంగా రంగంలోకి దిగి, ఎంత నష్టం జరిగిందో అంచనా వేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంపై నెపం నెట్టి, సాయం అడుగుతామని చెప్పి ముఖ్యమంత్రి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నష్టం జరిగినప్పుడు దానికి సంబంధించిన వివరాలు అధికారుల వద్ద ఉండాలి కదా అని ప్రశ్నించారు.
రైతులకు న్యాయం చేయాలని డిమాండ్
రాజకీయ లబ్ధి కోసమే సాగునీటిని ఎత్తిపోయకుండా రైతులను నష్టాలపాలు చేస్తున్నారని కవిత ఆరోపించారు. ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజాసేవ కోసమే జీతాలు తీసుకుంటున్నారని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లోనూ వర్షాలు సరిగా పడకపోవచ్చని వాతావరణ హెచ్చరికలు ఉన్నందున, ఇప్పటికైనా అప్రమత్తమై ప్రాణహిత నీటిని ఎత్తిపోసుకోవాలని సూచించారు.
ప్రభుత్వం వెంటనే 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని, సాగునీటిని అందించి ఎండిపోతున్న పంటలను కాపాడాలని, నష్టపోయిన ప్రతి రైతుకూ పంట నష్టాన్ని అంచనా వేసి తక్షణమే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఒక్కో రైతుకు ఎకరాకు సుమారు రూ.50 వేల వరకు నష్టం జరుగుతోందని కవిత పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
Also Read : ప్రపంచ రికార్డు బద్దలు.. అదరగొట్టిన శీతల్, తోమన్!
Follow Us On: Youtube

