కలం, స్పోర్ట్స్: ప్రపంచ రికార్డు బద్దలైంది. భారత పారా ఆర్చర్లు షీతల్ దేవి (Sheetal Devi), తోమన్ కుమార్ (Toman Kumar) అదరగొట్టారు. జపాన్‌లో జరుగుతున్న ఆసియా పారా గేమ్స్‌లో మిక్స్‌డ్ టీమ్ విభాగంలో 1402 పాయింట్లు సాధించారు. గతంలో ఉన్న 1400 పాయింట్ల ప్రపంచ రికార్డును అధిగమించారు. ఈ పోటీ సోమవారం ఒకాజాకిలోని చువో సోగో పార్క్‌లో జరిగింది. గతంలో షీతల్ దేవి, రాకేశ్ కుమార్ జోడీ ఈ రికార్డును నెలకొల్పింది. ఈ ఏడాది అహ్మదాబాద్‌లో జరిగిన వరల్డ్ పారా ఆర్చరీ సిరీస్‌లో 1400 పాయింట్లు సాధించింది. ఇప్పుడు షీతల్, తోమన్ ఆ రికార్డును తిరగరాశారు.
2023 హాంగ్‌జౌ ఆసియా పారా గేమ్స్‌లో చైనా సాధించిన 1382 పాయింట్ల రికార్డును కూడా అధిగమించారు. వ్యక్తిగత విభాగంలోనూ షీతల్ దేవి అదరగొట్టింది. మహిళల కాంపౌండ్ ర్యాంకింగ్ రౌండ్‌లో 704 పాయింట్లు సాధించింది. దీంతో ఆసియా రికార్డును బద్దలు కొట్టడంతో పాటు ప్రపంచ రికార్డును సమం చేసింది. ఈ విభాగంలో అగ్రస్థానంలో నిలిచింది. సింగపూర్‌కు చెందిన నూర్ సయ్యదా అలీమ్ 683 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. పురుషుల కాంపౌండ్ విభాగంలో తోమన్ కుమార్ 698 పాయింట్లు సాధించాడు.
ఇది అతడి వ్యక్తిగత అత్యుత్తమ స్కోరు. ఈ ప్రదర్శనతో మూడో స్థానంలో నిలిచాడు. చైనాకు చెందిన యిచెంగ్ జాంగ్ 708 పాయింట్లతో ఆసియా రికార్డు నెలకొల్పాడు. షీతల్ దేవి (Sheetal Devi) ఇప్పటికే పారా ఆర్చరీలో పలు ఘనతలు సాధించింది. 2023 ఆసియా పారా గేమ్స్‌లో మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం గెలిచింది. 2024 పారిస్ పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించింది.
ప్రపంచ ఛాంపియన్‌గా కూడా నిలిచింది. మరోవైపు తోమన్ కుమార్ పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో ప్రపంచ ఛాంపియన్‌గా ఉన్నాడు. తన విభాగంలో ప్రపంచ నంబర్ వన్‌గా కొనసాగుతున్నాడు. ప్రపంచ రికార్డు సాధించిన భారత జోడీ ఇప్పుడు ఫైనల్‌లో స్వర్ణ పతకంపై గురిపెట్టింది. ర్యాంకింగ్ రౌండ్‌లో చూపిన ప్రదర్శనతో పతక పోటీలో ప్రధాన ప్రత్యర్థిగా నిలిచింది.
Also Read : ఎనిమిదో నెంబర్ వరకు బ్యాటింగ్ దండగ: గవాస్కర్
Follow Us On: Youtube

