కలం, వనపర్తి: విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. వనపర్తి మండలంలోని పెద్దగూడెం తండాలో ఎండిపోయిన వరి పంటలను (Dried Paddy Crops) బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. తండాలో సుమారు 150 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు రైతులు తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ఎకరాకు సుమారు రూ.25 వేల పెట్టుబడి పెట్టి సాగు చేసినా.. విద్యుత్ సరఫరాలో అంతరాయాల కారణంగా పంటలు కళ్ల ముందే ఎండిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులు రూప్లానాయక్, దేశ్‌నాయక్, చందునాయక్, దూద్యనాయక్ తదితరులు తమ పంట నష్టాన్ని నిరంజన్‌రెడ్డికి (Former Minister Niranjan Reddy) వివరించారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి ప్రకృతి తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతో ఏర్పడిన కరువని విమర్శించారు. విద్యుత్ సరఫరాలో సమయపాలన లేకపోవడంతో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ పంటలు ఎండిపోతున్నాయని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పంట నష్టంపై సమగ్ర సమీక్ష నిర్వహించి బాధిత రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
పెద్దగూడెం తండాతో పాటు పలు గ్రామాల్లో వందల ఎకరాల్లో వానాకాలం పంటలు దెబ్బతిన్నాయని ఆయన పేర్కొన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అటవీ ప్రాంతంలో రెండు చెరువులు నిర్మించడంతో భూగర్భ జలాలు పెరిగాయని, నీటి లభ్యత ఉన్నప్పటికీ విద్యుత్ కోతల కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ ప్రాంతంలోని గిరిజన రైతులకు భూములపై హక్కులు కల్పిస్తూ గతంలో 96 మందికి పట్టాలు ఇచ్చామని, మరో 56 మందికి పట్టాలు ఇవ్వాల్సి ఉందని నిరంజన్‌రెడ్డి తెలిపారు. పెండింగ్‌లో ఉన్న పట్టాల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
రాష్ట్రంలో బొగ్గు కొరత ఉందంటూ ప్రభుత్వం చెబుతున్న కారణాలు సమర్థనీయం కావని ఆయన విమర్శించారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి లభ్యత ఉన్నప్పటికీ పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల పంపుల నిర్వహణ, నీటి సరఫరాపై ప్రభుత్వం తగిన శ్రద్ధ చూపడం లేదని ఆరోపించారు. నీటి పారుదల, విద్యుత్ సరఫరాపై ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారని అన్నారు.
కృష్ణా జలాల వినియోగం విషయంలోనూ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. వ్యవసాయంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు రెండున్నర కోట్ల మంది ఆధారపడి ఉన్నారని పేర్కొన్న ఆయన.. రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పంటలు నష్టపోయిన రైతులు అధైర్యపడవద్దని, వారికి నష్టపరిహారం అందేలా ప్రభుత్వంపై పోరాడతామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వాకిటి శ్రీధర్, నందిమల్ల అశోక్, కె. మాణిక్యం, రఘువర్ధన్‌రెడ్డి, రవిప్రకాష్‌రెడ్డి, ధర్మానాయక్, మాధవ్‌రెడ్డి, సునీల్ వాల్మీకి, శంకర్‌నాయక్, చిట్యాల రాము, నారాయణనాయక్, టీక్యానాయక్, గోవిందునాయక్, అలీం తదితరులు పాల్గొన్నారు.

