కలం, ఆదిలాబాద్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో ఘనంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. సద్దుల బతుకమ్మను పురస్కరించుకొని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి వేడుకలను ప్రారంభించారు.
కలెక్టర్తో పాటు ఎస్పీ అఖిల్ మహాజన్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొని బతుకమ్మను ఆడుతూ మహిళలు, యువతులతో కలిసి సంబురాల్లో భాగస్వాములయ్యారు. సాంస్కృతిక కార్యక్రమాలు, బతుకమ్మ పాటలతో స్టేడియం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రైతులు, మహిళలు, యువతులు, జిల్లా ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ పండుగ ప్రతి ఇంట ఆనందాన్ని, సౌభాగ్యాన్ని నింపాలని ఆకాంక్షించారు.

