కలం, స్పోర్ట్స్: రంజీ ట్రోఫీలో భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీ (Mohammed Shami) ఆడకపోవడంపై బెంగాల్ ప్రధాన కోచ్ లక్ష్మీ రతన్ శుక్లా స్పష్టతనిచ్చారు. న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్కు ఎంపిక కాకపోవడంతో షమీ వైదొలిగాడనే వార్తలను ఆయన కొట్టిపారేశారు. షమీ సంపూర్ణ ఫిట్నెస్తో ఉన్నాడని, పనిభారాన్ని తగ్గించుకోవడానికే ఈ మ్యాచ్ నుండి విశ్రాంతి తీసుకున్నాడని తెలిపారు.
గత రంజీ సీజన్లో ఏడు మ్యాచ్ల్లో 37 వికెట్లు తీసి షమీ సంచలన ప్రదర్శన చేశాడు. ఈ సీజన్ మొదటి మ్యాచ్లో కూడా ఢిల్లీపై 4 వికెట్లతో మెరిసాడు. ఆ మ్యాచ్లో ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయడంతో, సర్వీసెస్తో జరిగే రౌండ్ మ్యాచ్కు విశ్రాంతి కావాలని షమీ స్వయంగా కోరాడని కోచ్ వెల్లడించారు.

