కలం, సోన్ : నిర్మల్ జిల్లా సోన్ మండలం కడ్తాల్ (Kadthal) గ్రామంలో ఆదివారం గంగనీళ్ల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం దేగాం గ్రామానికి చెందిన పోచమ్మ తల్లి ఆభరణాలకు శనివారం సాయంత్రం గ్రామస్తులు స్వాగతం పలికారు. ఆదివారం తెల్లవారుజామున సోన్ మండలంలోని గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, అమ్మవారి ఆభరణాలను శుద్ధి చేశారు. అనంతరం ఆభరణాలు, గంగాజలంతో పాదయాత్రగా గ్రామానికి తీసుకువచ్చారు.
మహిళలు మంగళహారతులు బాజాభజంత్రీలతో గ్రామ పురవీధుల గుండా ఆభరణాల ఊరేగింపు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పాడిపంటలు సమృద్ధిగా పండాలని, గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, పిల్లాపాపలను చల్లగా చూడాలని పోచమ్మ తల్లిని వేడుకున్నారు. జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్రామ వీడీసీ ఆధ్వర్యంలో అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుర్రం రాము, వీడీసీ చైర్మన్ గుర్రం గంగన్న పాల్గొన్నారు.

