కలం, బాసర : బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం (Basara Saraswati Temple)లో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఎనిమిదో రోజు అమ్మవారు మహాగౌరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రుల్లో ఎనిమిదో రోజున దుర్గాదేవిని మహాగౌరి రూపంలో పూజించడం విశేషం.
‘గౌరి’ అంటే తెలుపు అని అర్థం. తెల్లని కాంతితో ప్రకాశించే అమ్మవారిని మహాగౌరిగా కొలుస్తారు. ఈ రూపంలో అమ్మవారు నాలుగు చేతులతో దర్శనమిస్తారు. ఒక చేతిలో త్రిశూలం, మరో చేతిలో డమరుకం ధరించి, మిగిలిన రెండు చేతులతో అభయ, వరద ముద్రలను ప్రదర్శిస్తారు. తెల్లని వృషభ వాహనంపై అమ్మవారు కొలువుదీరినట్లు పురాణాలు వివరిస్తున్నాయి. మహాగౌరి అమ్మవారిని తొమ్మిదేళ్ల బాలిక రూపంగా భావించే సంప్రదాయం కూడా ఉంది.
అందుకే అనేక ప్రాంతాల్లో నవరాత్రుల సందర్భంగా కన్యాపూజ నిర్వహించి, బాలికలను అమ్మవారి ప్రతిరూపాలుగా భావించి పూజిస్తారు. శ్రీరాముడిని భర్తగా పొందేందుకు సీతాదేవి గౌరీ వ్రతం ఆచరించినట్లు పురాణ ప్రశస్తి ఉంది. వివాహం కాని యువతులు, కన్యలు మహాగౌరి అమ్మవారిని తెల్లని పూలతో భక్తిశ్రద్ధలతో పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. శరన్నవరాత్రుల వేళ బాసర క్షేత్రం (Basara Saraswati Temple) భక్తుల సందడితో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

