కలం, వెబ్ డెస్క్ : కడప జిల్లా పులివెందుల (Pulivendula)లో ఉద్రిక్త పరిస్థితుల నడుమ నామినేషన్ల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. నిన్న జరిగిన అల్లర్ల నేపథ్యంలో పట్టణంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా భారీ సంఖ్యలో పోలీసు బలగాలను రంగంలోకి దించారు.
ముఖ్యంగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నివాసం వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ ఆడిటోరియం చుట్టూ భారీగా బలగాలను మోహరించి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పట్టణంలోని అన్ని కీలక ప్రాంతాల్లో నిఘా పెంచడంతో పాటు గస్తీని ముమ్మరం చేశారు. నామినేషన్ల ప్రక్రియ ఎటువంటి ఘర్షణలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో ముగిసేలా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ప్రస్తుతం పులివెందుల వ్యాప్తంగా ఉత్కంఠభరిత వాతావరణం కొనసాగుతోంది.

