పండుగలు వస్తే బాదుడేనా.. ఆర్టీసీ చార్జీలపై హరీశ్ ఫైర్

కలం, వెబ్ డెస్క్ : బతుకమ్మ, దసరా పండుగల వేళ ఆర్టీసీ టికెట్ ఛార్జీలు (TGSRTC Ticket Hike) పెంచడంపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగలు వస్తే చాలు రేట్లు పెంచి ప్రజలను బాదుడేనా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. బతుకమ్మ, దసరా పండుగ వేళ ప్రజలకు కానుకలు ఇవ్వాల్సింది పోయి.. టికెట్ ధరలను డబుల్ చేసి నిలువుదోపిడీ చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

రెగ్యులర్ బస్సులు తగ్గించి, స్పెషల్ బస్సులు వేసి ప్రయాణికుల జేబులకు చిల్లులు పెట్టడమేనని హరీశ్ రావు ఫైర్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రూట్లలో టికెట్ రేట్లను పెంచి ప్రజలకు పండుగ సంబురం లేకుండా చేస్తున్నారని ప్రభుత్వాన్ని ఆయన (Harish Rao) విమర్శించారు. బస్సుల సంఖ్య పెంచకుండా, రెగ్యులర్‌గా నడిచే బస్సులకే పండుగ స్పెషల్ బోర్డులు తగిలించి దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.

మహిళలకు ఫ్రీ టికెట్ అని చెప్పి.. పురుషుల నుంచి డబుల్ ఛార్జీలు వసూలు చేస్తారా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్ వసూలు చేస్తే.. రాయితీ ఇచ్చినట్టా అని నిలదీశారు. ఇలా చేస్తే ఆ భారాన్ని తిరిగి అదే కుటుంబం పై మోపడమే కదా అని తెలిపారు.

మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో ఆర్టీసీ టికెట్ ఛార్జీలను 5 సార్లు పెంచారని.. ఇప్పుడు పండుగల పేరుతో డబుల్ వసూల్ చేస్తూ ప్రజల నడ్డి విరుస్తున్నారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదనపు ఛార్జీలపై ప్రభుత్వం వెంటనే స్పందించి టికెట్ రెట్లు తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.

Also Read : దుర్గా పూజ మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>