కలం, మహబూబ్ నగర్ బ్యూరో: పాలమూరు నీళ్ల విషయంలో వెనక్కి తగ్గేదే లేదని, తన రాజకీయ గురువు అయిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోసం తలనైనా నరుక్కుంటానని, కానీ సాగు నీళ్ల కోసం గురువుతోనైనా యుద్ధం చేస్తానని జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి (MLA Anirudh Reddy0 స్పష్టం చేశారు. తన ప్రాంత ప్రయోజనాలే తనకు ముఖ్యమని ఆయన అన్నారు. శనివారం జడ్చర్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలమూరుకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికోసం తన ప్రాణాలైనా ఇస్తానని, కానీ పాలమూరు నీళ్లను తరలించుకుపోతే మాత్రం సహించబోనని అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ఎత్తిపోతల పథకాలకు నీటి కేటాయింపుల వ్యవహారంపై తన వైఖరిని స్పష్టం చేశారు. ఏదుల రిజర్వాయర్ నుంచి డిండి ఎత్తిపోతలకు నీటిని తరలించే ప్రతిపాదనను తాము అంగీకరించబోమని తేల్చిచెప్పారు. ముందుగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా పాలమూరుకు నీళ్లు అందించాలని, ఆ తర్వాతే డిండి ప్రాజెక్టుకు నీటిని ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్, హయాంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు కేవలం 60 శాతం మాత్రమే జరిగాయని ఆరోపించారు. ఏదుల నుంచే డిండి ఎత్తిపోతలకు నీటిని తరలిస్తామని అప్పటి సీఎం కేసీఆర్ అసెంబ్లీలోనే చెప్పారని, ప్రతిపక్షాలు అప్పుడు మౌనంగా ఉండి ఇప్పుడు రాజకీయం చేయడం సరికాదని విమర్శించారు. జేఏసీ ఆధ్వర్యంలో చేపడుతున్న జల దీక్షకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్పష్టం చేశారు. పాలమూరు ఎమ్మెల్యేలంతా కలిసికట్టుగా పోరాడి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసుకుంటామని, సీఎం రేవంత్ రెడ్డి పాలమూరుకు మాత్రమే కాదు రాష్ట్రానికి సీఎం అని, ప్రతి విషయంలో ఆయనను బద్నాం చేయవద్దని అన్నారు. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు వంశీ చారి, మాజీ ఎంపీపీ నిత్యానందం, అశోక్ యాదవ్, మాలిక్ షాకీర్, భాస్కర్ రెడ్డి , కుమ్మరి రాజు, మార్కెట్ కమిటీ, వైస్ ప్రెసిడెంట్ రాజు గౌడ్ సర్పంచ్ గిరి ప్రసాద్, కరీం, రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

