డ్రగ్స్‌పై పోరు.. ఐఐటీ హైదరాబాద్‌లో ఆల్ స్టేట్స్ పోలీస్ బైక్ ర్యాలీ

కలం, మెద‌క్ బ్యూరో: మాదకద్రవ్యాల వినియోగం వల్ల యువత అనేక దుష్పరిణామాలను ఎదుర్కొంటున్నారని సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. డ్రగ్స్‌కు బానిసలైన వారి ఆరోగ్యం, భవిష్యత్తు, కుటుంబ జీవితం తీవ్రంగా దెబ్బతింటాయని అన్నారు. విద్యార్థులల్లో మాదకద్రవ్యాల వ్యసనం వ్యక్తిగత జీవితానికే కాకుండా సమాజానికి కూడా నష్టాన్ని కలిగిస్తుందన్నారు. “ఏక్ థా దివాస్’‘ కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించారు. హైదరాబాద్‌లోని ఐసీసీసీ నుంచి గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వరకు నిర్వహిస్తున్న ఆల్ స్టేట్స్ పోలీస్ బైక్ ర్యాలీకి ఐఐటీ హైదరాబాద్‌లో (IIT Hyderabad) క్యాంపస్‌లో కొన‌సాగింది.

అనంతరం ఐఐటీ హైదరాబాద్‌లో ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ, తమ స్నేహితులు, తోటి విద్యార్థులు మాదకద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కల్పించాలన్నారు. డ్రగ్స్ మహమ్మారిని సమాజం నుంచి తరిమికొట్టేందుకు యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. మాదకద్రవ్యాల వ్యతిరేక ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

బాధ్యతాయుతమైన సమాజ నిర్మాణంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని తెలిపారు. ఈగల్ టీమ్ డీఎస్పీ పుష్పన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమంలో ఐఐటీ హైదరాబాద్, ఎంఎన్‌ఆర్ యూనివర్సిటీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఐఐటీ హైదరాబాద్ డీన్ డా. ప్రశాంత్ కుమార్, డీన్ డా. ప్రేమ్ పాల్,, డీఎస్పీలు, పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>