కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల (AP Local Elections) నామినేషన్ల పర్వం తీవ్ర ఉద్రిక్తతలకు , హింసాత్మక ఘటనలకు వేదికగా మారింది. ముఖ్యంగా తిరుపతి, కడప, పులివెందులతో పాటు ప్రకాశం జిల్లా దర్శిలో జరిగిన హింసాత్మక పరిణామాలపై ప్రతిపక్ష వైసీపీ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల్లో తమ అభ్యర్థులకు తీవ్ర ప్రాణహాని ఉందని, వారికి తగిన రక్షణ కల్పించడంతో పాటు పారా మిలటరీ బలగాలను మోహరించేలా ఆదేశాలివ్వాలని వైసీపీ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. అలాగే సీసీ కెమెరాల ఏర్పాటు, వెబ్ కాస్టింగ్ నిర్వహణపై గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్లో అప్పీల్ చేసింది.
కాగా, స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా పలు ప్రాంతాల్లో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ వర్గీయుల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే కడప జిల్లా పులివెందుల నామినేషన్ కేంద్రం వద్ద పరిస్థితి ఒక్కసారిగా రణరంగంగా మారింది. అక్కడ నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిన వైసీపీ అభ్యర్థులను టీడీపీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం జరగడంతో ఇరువర్గాలు తలపడ్డాయి. శాంతిభద్రతలు క్షీణించి పరిస్థితి చేయిదాటేలా కనిపిస్తుండటంతో గొడవ పడుతున్న ఇరువర్గాలను చెదరగొట్టేందుకు రంగంలోకి దిగిన పోలీసులు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది.
మరోవైపు ప్రకాశం జిల్లా దర్శి నామినేషన్ కేంద్రం వద్ద సైతం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు వెళ్తున్న వైసీపీ అభ్యర్థులను టీడీపీ శ్రేణులు అడ్డుకుని, వారి వద్ద ఉన్న నామినేషన్ పత్రాలను బలవంతంగా లాక్కొని చించివేశారు. ఈ ఘటనతో రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగి భయాందోళనలు నెలకొన్నాయి. వెంటనే స్పందించిన పోలీసులు ఇరువర్గాల నాయకులను, కార్యకర్తలను అక్కడ నుంచి చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. స్థానిక సంస్థల నామినేషన్ల వేళ వరుసగా చోటుచేసుకుంటున్న ఈ హింసాత్మక ఘటనలతో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వాతావరణం తీవ్రంగా వేడెక్కింది.

