కలం, కుంటాల : పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా లబ్ధిదారులకు దసరా పండుగ కానుకగా చెక్కులను పంపిణీ చేసినట్టు ముధోల్ ఎమ్మెల్యే (Mudhole MLA) పవార్ రామారావు అన్నారు. కుంటాల మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో మండలంలోని 68 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను శనివారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పండుగ వేళ ఆర్థిక సాయం అందడంతో పేద కుటుంబాలకు కొంత ఊరట లభించిందని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, ఎల్నినో ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు విద్యుత్ సమస్యలు కూడా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుత వాతావరణ, కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు సాగునీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. తక్కువ నీటితో పండే పంటలు, తక్కువ కాలంలో చేతికొచ్చే పంటలను సాగు చేస్తూ మెరుగైన దిగుబడులు సాధించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, మండల బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

