కలం, హుజూర్నగర్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, నీటిపారుదల శాఖ అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ పార్టీ ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ సైదిరెడ్డి శానంపూడి (Shanampudi Saidireddy) మండిపడ్డారు. సొంత నియోజకవర్గంలోనే పంటలకు నీరందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే నీటిపారుదల శాఖ మంత్రికి పట్టకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం మఠంపల్లి మండలం భీల్యానాయక్ తండా (Bheelyanaik Thanda) గ్రామంలో మాజీ సర్పంచ్ కోటా నాయక్ ఆధ్వర్యంలో నీరు లేక ఎండిపోయిన పంట పొలాలను సైదిరెడ్డి శానంపూడి పరిశీలించారు. పంటలు ఎండిపోవడంతో అప్పులపాలవుతున్నామని రైతులు తమ ఆవేదనను ఆయనకు వివరించారు.
ఈ సందర్భంగా సైదిరెడ్డి శానంపూడి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ నియంతృత్వ పోకడల వల్ల రైతులు తమ పంటలకు సాగునీరు, విద్యుత్ ఎప్పుడు అందుతాయో తెలియక అయోమయానికి గురవుతున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో వ్యవసాయానికి ఉచితంగా, నిరంతరాయంగా 24 గంటల విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చాక రైతులకు కనీసం సాగునీరు కూడా అందించలేకపోతోందని విమర్శించారు.
రైతుల దయనీయ పరిస్థితిని చూసైనా ప్రభుత్వం, ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. పంటలను కాపాడేందుకు తక్షణమే సాగునీటి విడుదల షెడ్యూల్ను అధికారికంగా ప్రకటించాలని, ఎన్నికల హామీ మేరకు వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ను పునరుద్ధరించాలని కోరారు. చేతికి వచ్చిన పంటలు ఎండిపోకుండా సాగునీరు, విద్యుత్ సరఫరా చేసి నష్టాల్లో ఉన్న అన్నదాతలను ఆదుకోవాలని సైదిరెడ్డి శానంపూడి (Saidireddy) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Also Read : లతా రెడ్డిగా కీర్తి సురేశ్.. బర్త్డే లుక్ అదిరిందిగా..!
Follow Us On: X(Twitter)

