మీరట్ మరో భర్త హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణ శిక్ష

కలం, నేషనల్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌‌లోని మీరట్‌ బ్లూ డ్రమ్ కేసులో భర్తను హత్య చేసిన భార్య, ప్రియుడికి స్థానిక మీరట్ కోర్టు మరణ శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. గత రెండు రోజుల క్రితమే ఈ తీర్పు వెల్లడవగా.. తాజాగా శుక్రవారం అదే కోర్టు మరో తీర్పు వెల్లడించింది. వివాహేతర సంబంధం కోసం ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన మరో కేసు (Meerut Murder Case)పై విచారణ చేపట్టిన మీరట్ కోర్టు.. విస్తుపోయే తీర్పునిచ్చింది. భర్తను చంపిన భార్య, ప్రియుడికి మరణ శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. నేరం జరిగిన ఏడాదిన్నర లోపే న్యాయస్థానం ఈ తీర్పును వెల్లడించింది. రెండు కేసులను విడివిడిగా ధర్మాసనం విచారణ చేపట్టగా.. మొత్తం నలుగురికి మరణ శిక్ష విధించడం గమనార్హం.

అసలేమైందంటే..

యూపీ మీరట్‌లోని బహుసుమ ప్రాంతం అక్బర్‌పూర్ సాదత్ గ్రామానికి చెందిన అమిత్ కశ్యప్‌ను 2025 ఏప్రిల్ 12న రాత్రి అతని భార్య రవిత, ప్రియుడు అమర్‌దీప్ గొంతు నులిమి చంపేశారు. ఈ నేరం నుంచి తప్పించుకునేందుకు మృతదేహంపై పామును పెట్టి.. పాము కాటువల్లే చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడి మెడపై గాయాలు కనిపించడం, మృతదేహం వద్ద ఉన్నపాముకు విషం లేదని తేలడంపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. చివరికి పోస్టుమార్టం నివేదికలో అమిత్‌ది హత్యేనని తేలడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది.

నిందితుల కాల్ డేటా రికార్డులను సైతం పోలీసులు పరిశీలించారు. హత్య జరిగిన రోజునే ఆ ఇద్దరూ 50 సార్లు ఫోన్ లో మాట్లాడుకున్నట్లు వెల్లడించారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన న్యాయస్థానం మృతుడు తరపు లాయర్, నిందితుల తరఫు న్యాయవాది వాదనలు పరిగణలోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను పరిశీలించి మృతుడు అమిత్ కశ్యప్‌ను భార్య, ప్రియుడే చంపారని కోర్టు అంగీకరించింది. వీరిద్దరికి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. అయితే శిక్ష ఖరారు చేసే ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు.. దోషులను సంప్రదించింది. తమ పిల్లలను, వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవాలని కోరుతూ దోషులు రవిత, అమర్‌దీప్‌లు కన్నీటిపర్యంతమయ్యారు.

మీరట్‌ బ్లూ డ్రమ్ కేసు..

సరిగ్గా రెండు రోజుల క్రితం అక్టోబర్ 14న యూపీలోని మీరట్‌లో భర్త సౌరబ్ రాజ్ పుత్‌ను ముక్కలుగా చేసి బ్లూ డ్రమ్‌లో దాచి పెట్టిన కేసులో భార్య, ప్రియుడికి మీరట్ కోర్టు మరణ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసులో భార్య ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాకు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ తీర్పు సందర్భంగా డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జ్‌ అరవింద్‌ కుమార్‌ మిశ్రా మహాభారత శ్లోకాన్ని ప్రస్తావించారు. తప్పు చేసిన వారిని శిక్షించడం (దుష్ట శిక్షణ – శిష్ట రక్షణ) కూడా ధర్మంలో భాగమేనని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>