కలం, లక్ష్మణచాంద: నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం తీర్పేల్లి (Thirpalle) గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టీల్ బ్యాంక్ను గ్రామ సర్పంచ్ గిరిజ రవి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలనే ఉద్దేశంతో స్టీల్ బ్యాంక్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
గ్రామంలో నిర్వహించే శుభకార్యాలు, ఇతర సామూహిక కార్యక్రమాల్లో స్టీల్ పాత్రలను వినియోగించడం ద్వారా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించవచ్చని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ప్రవీణ్, పంచాయతీ కార్యదర్శి వంశీ, ఎంపీవో నాసిరోద్దీన్, బీజేపీ మండల అధ్యక్షుడు చిన్నయ్య, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

