ఎల్‌ నినోపై రైతులకు అవగాహన కల్పిస్తున్న స్పెషల్ ఆఫీసర్లు

కలం, తెలంగాణ బ్యూరో: ఎల్‌ నినో ప్రభావాన్ని (El Nino Impact) పర్యవేక్షించేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తున్నది. రానున్న రోజుల్లో తాగు, సాగు నీళ్లు, విద్యుత్ సరఫరాకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాలకు 10 మంది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లను (IAS Officers) ప్రత్యేక అధికారులుగా నియమించింది. వీళ్లు ఆయా జిల్లాల్లో వాతావరణ పరిస్థితులు, వర్షపాతం, నీటి లభ్యత, వ్యవసాయ రంగ పరిస్థితులు, విద్యుత్ సరఫరాను నిరంతరం పర్యవేక్షించి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు అందించనున్నారు.

ఇవీ బాధ్యతలు..

. ఎల్‌ నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి, ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో నీటి వనరుల పరిస్థితిపై ప్రత్యేక అధికారులు దృష్టిసారించనున్నారు. జలాశయాల్లో నీటి నిల్వలు, భూగర్భ జలమట్టాలు, గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి సరఫరా, సాగునీటి అవసరాలను సమీక్షించనున్నారు. నీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయనున్నారు.

. వర్షపాతం లోటు కారణంగా పంటల సాగుకు ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించడం, రైతులకు అవసరమైన సాయం అందించడంపై దృష్టిపెట్టనున్నారు. తీవ్ర వర్షాభావం ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయ శాఖతో సమన్వయం చేసుకుంటూ తగిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వానికి సూచనలు అందించనున్నారు. తక్కువ నీటితో పండించే ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించనున్నారు.

. ఎండల తీవ్రతతో ఇటు గృహవసరాలు, అటు వ్యవసాయ వినియోగానికి విద్యుత్ డిమాండ్‌ భారీగా పెరగనున్నది. దీంతో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా, అందుబాటులో ఉన్న విద్యుత్‌ను సమర్థవంతంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోనున్నారు.

ప్రత్యేక అధికారులు వీళ్లే..

. హైదరాబాద్: జయేశ్ రంజన్
. రంగారెడ్డి: వికాస్ రాజ్
. కరీంనగర్: బెనహర్ మహేశ్ దత్తా ఎక్కా
. మెదక్: ఎ.వాణిప్రసాద్
. నిజామాబాద్: యోగితారాణా
. నల్లగొండ: హరిచందన దాసరి
. ఆదిలాబాద్: కె.ఇలంబర్తి
. వరంగల్: శ్రీదేవసేన
. మహబూబ్‌నగర్: వీపీ గౌతమ్
. ఖమ్మం: అనుదీప్ దురిశెట్టి

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>