కలం, కరీంనగర్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని కరీంనగర్ కలెక్టరేట్లో శుక్రవారం రాత్రి ఉద్యోగుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా (Collector Chitra Mishra) అధికారినిలతో, ఉద్యోగినులతో కలిసి బతుకమ్మ ఆడి సందడి చేశారు. తెలంగాణ జానపద గీతాలు, సన్నాయి, డోలు వాయిద్యాల నడుమ ఐడీఓసీ ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది.
కరీంనగర్ జిల్లా ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి, కన్వీనర్ మడిపల్లి కాళీ చరణ్ గౌడ్ ఆధ్వర్యంలో, ఎంప్లాయిస్ జేఏసీ భాగస్వామ్య సంఘాల నాయకులు, ఉద్యోగుల సహకారంతో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వివిధ శాఖలకు చెందిన మహిళా ఉద్యోగులు సంప్రదాయబద్ధంగా రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, వాటి చుట్టూ చేరి ఆటపాటలతో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సత్తుపిండి వితరణ చేపట్టారు.
బతుకమ్మ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతితో మమేకమైన జీవన విధానానికి ప్రతీక అని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. ఇది కేవలం పూల పండుగ మాత్రమే కాదని, మహిళల ఐక్యతకు, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ఇలాంటి సాంస్కృతిక వేడుకలు ఉద్యోగుల మధ్య స్నేహభావాన్ని, ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు రూపొందించిన బతుకమ్మలను కలెక్టర్ పరిశీలించి, ఎంపిక చేసిన బతుకమ్మల నిర్వాహకులకు బహుమతులు అందజేశారు. వేడుకల్లో మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొనగా, ఉద్యోగ సంఘాల నాయకులు కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డి, డీఆర్వో స్వామి, ఆర్డీవోలు షర్మిల, జలకుమారి జిల్లాస్థాయి అధికారులు, ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి, కన్వీనర్ మడిపల్లి కాళీ చరణ్ గౌడ్, టీఎన్జీవోల సంఘం కార్యదర్శి సంగేం లక్ష్మణ్ రావు, కోశాధికారి కిరణ్ కుమార్ రెడ్డి, గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా కార్యదర్శి అరవింద్ రెడ్డి, రెవెన్యూ సర్వీస్ జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్, నేరెళ్ల కిషన్, మహిళా నాయకులు శారద, సునీత, సరిత, సూర్య, శైలజ, టీఎన్జీవోల సంఘం రాష్ట్ర నాయకులు రాగి శ్రీనివాస్, సర్దార్ హర్మీంధర్ సింగ్, ప్రభాకర్ రెడ్డి, రమేష్ గౌడ్, ప్రసాద్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు రాజేష్ భరద్వాజ్, కార్యదర్శి వెలిచాల సుమంత్ రావు, మామిడి రమేష్, పోలూ కిషన్, అజ్గర్ అలీ, శంకర్, పెన్షనర్ల సంఘం నాయకుడు పెండ్యాల కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

