కుల వివ‌క్ష‌పై లంబాడి హక్కుల పోరాట సమితి ఫైర్‌!

కలం, వనపర్తి: పెద్దమందడి మండలం మంగంపల్లి (Mangampally) లో దళిత యువకుడు, అతని కుటుంబ సభ్యులపై కులవివక్షకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకట్రాం రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజవర్ధన్ రెడ్డిలను తక్షణమే అరెస్టు చేయాలని లంబాడి హక్కుల పోరాట సమితి (LHPS) డిమాండ్ చేసింది. బాధితులకు న్యాయం చేయకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించింది. శుక్రవారం సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆంగోతు రాజ్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ నాయక్ తదితరులు బాధితుడు మాసాని సుధీర్ కుటుంబాన్ని పరామర్శించి, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ నెల 12న గ్రామంలోని ఆలయ పునర్నిర్మాణం నేపథ్యంలో దర్శనానికి వెళ్లిన సుధీర్, అతని కుటుంబ సభ్యులను కులం పేరుతో దూషించి అవమానించినట్లు ఆరోపించారు. ఈ ఘటనపై జిల్లా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నా నిందితులపై చర్యలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని విమర్శించారు.

బహిష్కరణకు పాల్పడుతున్నారని ఆరోపణ

కులవివక్షకు తోడు సుధీర్ కుటుంబాన్ని సాంఘిక బహిష్కరణకు గురిచేస్తున్నారని సమితి నాయకులు ఆరోపించారు. సామాజిక న్యాయం కోసం సుధీర్ పోరాడటాన్ని సహించలేక కొందరు గ్రామస్థులకు అతని కుటుంబంతో సహకరించవద్దని సూచించినట్లు పేర్కొన్నారు. గ్రామంలో జరిగిన పనులకు సుధీర్ కుటుంబానికి చెందిన ట్రాక్టర్‌ను అనుమతించలేదని ఆరోపించారు. ఈ పరిణామాలపై స్థానిక ఎమ్మెల్యే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

నిందితులను అరెస్టు చేయాల‌ని డిమాండ్

కులం పేరుతో దూషించి, రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం కలిగించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై కేసు నమోదు చేసి, తక్షణమే అరెస్టు చేసి న్యాయస్థానానికి హాజరుపరచాలని డీఎస్పీకి వినతిపత్రం సమర్పించినట్లు నాయకులు తెలిపారు. కులవివక్షను అరికట్టడంలో ప్రజాప్రతినిధులు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగి, అధికారులు వారిని పరామర్శించి, ఆలయంలోకి ప్రవేశానికి అడ్డంకులు తొలగించే వరకు పునర్నిర్మాణ పనులు కొనసాగనివ్వబోమని సమితి నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో దొడ్ల రాములు, రాంబాబు నాయక్, ధర్మా నాయక్, బాబు నాయక్, టీక్యా నాయక్, రమేష్ నాయక్, చందు నాయక్, వెంకటేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>