యూనిక్ కంపెనీ పేరుతో పెట్టుబడుల మోసం

కలం, కరీంనగర్ బ్యూరో: గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌కు చెందిన యూనిక్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాజ్ కుమార్ రాయ్ అలియాస్ రాజ్ కుమార్ కైలాష్ రాయ్‌ (MD Raj Kumar Rai)ను పెట్టుబడుల మోసం కేసులో ఆదిలాబాద్ జిల్లా తలమడుగు పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం.

అధిక లాభాలు, మెచ్యూరిటీ ప్రయోజనాలు, అవసరమైతే ప్లాట్లు కేటాయిస్తామని నమ్మించి వార్షిక చెల్లింపులు, నెలవారీ కిస్తీలు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల ద్వారా ప్రజల నుంచి భారీగా డబ్బులు సేకరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. గడువు ముగిసినప్పటికీ పెట్టుబడులు, మెచ్యూరిటీ మొత్తాలను తిరిగి చెల్లించకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

ఈ వ్యవహారంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 14 కేసులు నమోదైనట్లు ప్రాథమికంగా గుర్తించారు. దేశవ్యాప్తంగా సుమారు 10 వేల మంది బాధితులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మోసం ద్వారా సేకరించిన డబ్బులతో నిందితుడు పలు రాష్ట్రాల్లో హోటళ్లు, భూములు, ప్లాట్లు కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు సమాచారం.

కరీంనగర్ జిల్లాలో యూనిక్ కంపెనీ పేరుతో పెట్టుబడులు పెట్టి మోసపోయిన బాధితులు వెంటనే కరీంనగర్ సీసీఎస్ పోలీస్ స్టేషన్‌ను లేదా అడిషనల్ డీసీపీ (అడ్మిన్)ను సంప్రదించి ఫిర్యాదు చేయాలని పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు. బాధితులు తమ వద్ద ఉన్న పెట్టుబడి రశీదులు, బ్యాంకు లావాదేవీల వివరాలు, కంపెనీకి సంబంధించిన పత్రాలు, ఇతర ఆధారాలను ఫిర్యాదుతో పాటు సమర్పించాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>