కలం, మెదక్ జిల్లా: రామాయంపేట చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఉద్యమకారులు (Telangana Activists) పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పోరాడిన ఉద్యమకారులను గుర్తించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యమకారులను గుర్తించి, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు ఈ నెల 18వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించడంపై వారు హర్షం వ్యక్తం చేశారు.
14 సంవత్సరాలు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నప్పటికీ, ఉద్యమకారులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందన్నారు. పదేళ్లపాటు పాలించినా వారికి గుర్తింపు ఇవ్వలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవులు అనుభవించి డబ్బులు సంపాదించుకున్నారని విమర్శించారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన 1,200 మంది ఉద్యమకారులకు కూడా సరైన గుర్తింపు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనైన తెలంగాణ ఉద్యమకారులకు సరైన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు, డీసీసీ ప్రధాన కార్యదర్శి కుమార్ సాగర్, తెలంగాణ మహాసభ జిల్లా అధ్యక్షులు బాలరాజు గౌడ్, తెలంగాణ ఉద్యమకారుడు పోలీస్ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

