గ్రామీణ క్రీడా ప్రతిభకు పెద్దపీట: కొత్తకాపు శివసేనారెడ్డి

కలం, వనపర్తి: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, వారికి తగిన అవకాశాలు కల్పించేందుకు వనపర్తి ఛాంపియన్స్‌ కప్‌-2026 (Wanaparthy Champions Cup) ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ కొత్తకాపు శివసేనారెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి చొరవతో విద్యార్హత, వయస్సుతో సంబంధం లేకుండా అన్ని మండలాల క్రీడాకారులకు అవకాశం కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు. శుక్రవారం వనపర్తి పట్టణంలోని పాలిటెక్నిక్‌ కళాశాల మైదానంలో జిల్లా కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, ఎస్పీ డి.సునీతారెడ్డితో కలిసి ఆయన పోటీలను ప్రారంభించారు. జిల్లా చరిత్రలో తొలిసారిగా 15 మండలాల క్రీడాకారులతో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. క్రికెట్‌, కబడ్డీ, వాలీబాల్‌, ఫుట్‌బాల్‌, టగ్‌ ఆఫ్‌ వార్‌, క్యారమ్స్‌, చెస్‌ విభాగాల్లో పోటీలు జరగనున్నాయి. తొలుత హాకీ మాంత్రికుడు మేజర్‌ ధ్యాన్‌చంద్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి, క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రారంభోత్సవంలో భాగంగా ప్రజాప్రతినిధుల బృందం, జిల్లా అధికారుల బృందం మధ్య టగ్‌ ఆఫ్‌ వార్‌ పోటీ నిర్వహించారు. ఇరు జట్లు ఒక్కోసారి విజయం సాధించాయి. అనంతరం కొత్తకోట, రేవల్లి మండలాల క్రికెట్‌ జట్ల మధ్య పోటీని టాస్‌ వేసి ప్రారంభించారు. ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానంలో వాలీబాల్‌, ఫుట్‌బాల్‌, కబడ్డీ, క్యారమ్స్‌, చెస్‌ పోటీలను కూడా అతిథులు ప్రారంభించారు. వాలీబాల్‌లో వనపర్తి-పానగల్‌, కబడ్డీలో పానగల్‌-చిన్నంబావి, ఫుట్‌బాల్‌లో అమరచింత-గోపాల్‌పేట జట్లు తలపడ్డాయి. చెస్‌లో కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, శివసేనారెడ్డి ఎత్తుకు పైఎత్తులు వేస్తూ క్రీడాకారులను ఉత్సాహపరిచారు. క్యారమ్స్‌లో ఎస్పీ డి.సునీతారెడ్డి తన ఆటతీరుతో ఆకట్టుకున్నారు.

రాష్ట్రస్థాయి పోటీలకు అవకాశం: శివసేనా రెడ్డి

ఛాంపియన్స్‌ కప్‌లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో పోటీపడేలా అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. వనపర్తిలో నిర్వహిస్తున్న ఈ పోటీలను స్ఫూర్తిగా తీసుకొని సంక్రాంతి నాటికి రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక వికాసం కలుగుతుందని పేర్కొన్నారు. కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి మాట్లాడుతూ ఛాంపియన్స్‌ కప్‌లో పాల్గొనే క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. క్రీడాస్ఫూర్తితో ఆడి విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. అత్యధిక ట్రోఫీలు సాధించిన మండలానికి ఛాంపియన్స్‌ ట్రోఫీ అందజేస్తామని వెల్లడించారు. ఎస్పీ డి.సునీతారెడ్డి మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని, అయితే మైదానంలో ఆడటం ద్వారా క్రమశిక్షణ, జట్టుగా పనిచేయడం, పరస్పర స్ఫూర్తి వంటి విలువలు అలవడతాయని అన్నారు. డిజిటల్‌ యుగంలో క్రీడా మైదానాల్లోకి వచ్చి ఆడటం వల్ల మానసిక ఉల్లాసం, ఆరోగ్యం, శారీరక దృఢత్వం పెరుగుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) ఎన్‌.ఖీమ్యా నాయక్‌, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, తహసీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్లు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>