ఫ్రెండ్లీ పోలీసింగ్ ముసుగులో జర్నలిస్టులపై దాడులా?: విమలక్క

కలం, కరీంనగర్: ప్రజల పక్షాన నిలబడి, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే జర్నలిస్టులపైనే పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలు రావడం అత్యంత ఆందోళనకరమని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య గౌరవాధ్యక్షురాలు విమలక్క (Vimalakka) తీవ్రంగా అన్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే భక్షకులుగా మారితే సామాన్యులకు దిక్కెవరు? అని ప్రశ్నించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అంటే ఇదేనా? రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేనట్టా? అని ఆమె ప్రశ్నించారు. ఈ ఘటనను ఆమె తీవ్రంగా ఖండించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో పోలీసుల చేతిలో చిత్రహింసలకు గురైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జర్నలిస్టులు పొత్తూరి శేఖర్‌, రాతిపల్లి సంపత్‌లను విమలక్క శుక్రవారం కరీంనగర్‌ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పరామర్శించారు. ఆసుపత్రిలోని క్రిటికల్‌ కేర్‌ విభాగంలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులు, కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా విమలక్క మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడం జర్నలిస్టుల బాధ్యత అని అన్నారు. ఆ బాధ్యతను నిర్వర్తించే వారిని భయభ్రాంతులకు గురిచేయడం రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛకు విరుద్ధమని చెప్పారు. ప్రజల సమస్యలను ప్రశ్నించినందుకు జర్నలిస్టులపై దాడులు జరిగితే ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదమని హెచ్చరించారు.

జర్నలిస్టులపై దాడులు.. కేసులు.. బెదిరింపులు కొనసాగితే మీడియా స్వేచ్ఛకు అర్థమేంటి? రాజన్న సిరిసిల్ల జిల్లాలో పాత్రికేయులు స్వేచ్ఛగా విధులు నిర్వహించలేని పరిస్థితులు నెలకొంటున్నాయన్న ఆందోళనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని కోరారు. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులు చట్టానికి అతీతులేమీ కాదని, విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడులు జరిగినట్లు ఆరోపణలు వచ్చినప్పుడు నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ప్రశ్నించే గొంతుకలను లాఠీలతో, బెదిరింపులతో, అక్రమ కేసులతో అణచివేయాలనుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని విమలక్క స్పష్టం చేశారు. జర్నలిస్టులపై దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులను కాపాడే ప్రయత్నం చేయకుండా, బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు.

జర్నలిస్టులపై దాడి ఘటనపై ఉన్నతస్థాయి, నిష్పక్షపాత విచారణ జరిపించాలని విమలక్క డిమాండ్ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐ శ్రీకాంత్‌ను తక్షణమే సస్పెండ్‌ చేయాలన్నారు.బాధ్యులుగా తేలిన పోలీసు సిబ్బందిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. “బాధిత జర్నలిస్టులు పొత్తూరి శేఖర్‌, రాతిపల్లి సంపత్‌లకు మెరుగైన వైద్య చికిత్స అందించాలి. జర్నలిస్టులు నిర్భయంగా విధులు నిర్వహించేలా ప్రభుత్వం రక్షణ కల్పించాలి. పాత్రికేయులపై వేధింపులు, బెదిరింపులు, దాడులు పునరావృతం కాకుండా స్పష్టమైన చర్యలు చేపట్టాలి. జర్నలిస్టులపై దాడి అంటే కేవలం ఇద్దరు వ్యక్తులపై జరిగిన దాడి మాత్రమే కాదు.. ప్రజల గొంతుకపై జరిగిన దాడి. మీడియా స్వేచ్ఛను కాపాడటం ప్రభుత్వ బాధ్యత. బాధితులకు న్యాయం జరిగే వరకు ఈ ఘటనను తేలికగా తీసుకోవద్దు’ అని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో నవ తెలంగాణ యువజన సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, జర్నలిస్టు బిజిగిరి నవీన్‌ కుమార్‌, డీఎల్ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి మార్వాడి సుదర్శన్‌, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర నాయకులు పోతుల రమేష్‌, రాకేష్‌, శ్రీలత, వెంకటేష్‌, వెంకి తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>