పీఆర్‌టీయూటీఎస్ రాష్ట్ర కౌన్సిల్‌లో కీలక నిర్ణయాలు

కలం, నల్లగొండ: పీఆర్‌టీయూటీఎస్ (PRTU TS) రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా సుంకరి భిక్షంగౌడ్, ప్రధాన కార్యదర్శిగా బి. మధుసూదన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నల్లగొండలో (Nalgonda) జరుగుతున్న పీఆర్‌టీయూటీఎస్ 6వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల రెండో రోజున శుక్రవారం సుమారు 5 వేల మంది ప్రతినిధుల సమక్షంలో ఎన్నికల అధికారులు పేరి వెంకట్‌రెడ్డి, గుండు లక్ష్మణ్, మనోహర్ రావు నూతన నాయకత్వంతో ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే 72,457 మంది ఆన్‌లైన్ సభ్యత్వంతో అతిపెద్ద ఉపాధ్యాయ సంఘంగా ఉన్న పీఆర్‌టీయూటీఎస్ నూతన నాయకత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఇదే వేదికపై రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్‌టీయూటీఎస్ అధికారిక అభ్యర్థిగా సుంకరి భిక్షంగౌడ్ పేరును శ్రీపాల్ రెడ్డి ప్రకటించారు. ఈ నిర్ణయానికి రాష్ట్ర పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు పేరి వెంకట్‌రెడ్డి పూర్తి మద్దతు ప్రకటించారు. ఉద్యోగుల హెల్త్ కార్డులు, పీఆర్‌సీ సాధన కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఉపాధ్యాయులు, నిరుద్యోగుల గొంతుకగా చట్టసభకు వెళ్తా: భిక్షంగౌడ్

పీఆర్‌టీయూటీఎస్ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం సుంకరి భిక్షంగౌడ్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోకపోవడంతో మూల్యం చెల్లించుకుందని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా సమస్యల పరిష్కారంలో మొండిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కనీసం ఒకటో తేదీన జీతాలు ఇవ్వకుండా, పదేళ్లలో ఒక్క ప్రమోషన్ కూడా ఇవ్వని గత పాలకులకు, హామీలను నెరవేర్చకుండా మొండిగా వ్యవహరిస్తున్న ప్రస్తుత ప్రభుత్వానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు.

30 ఏళ్లుగా సమస్యల పరిష్కారంలో అనుభవం ఉన్న తనను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిపిస్తే శాసనమండలిలో ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, పట్టభద్రుల తరఫున గొంతుకగా నిలుస్తానని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి, పీఆర్‌టీయూ సంఘ అధికార ప్రతినిధి వంగ మహేందర్ రెడ్డి, జగన్మోహన్ గుప్తా, కోమటిరెడ్డి నరసింహారెడ్డి, ఆడిట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, నల్లగొండ జిల్లా నాయకులు నారాయణరెడ్డి, జానారెడ్డి, మహిళా నేతలు గీత, వాణి, విజయలక్ష్మి, కళావతి, శ్రీవిద్య, జానకి, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. అలాగే 33 జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, వేలాది మంది బాధ్యులు, సభ్యులు హాజరయ్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>