కలం, నల్లగొండ : రాష్ట్రంలో ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడాలని, పీఆర్సీ అమలుపై ఇంకా తాత్సారం చేస్తే మరో తీవ్రమైన ఉద్యమం చేపట్టడం తప్పదని పీఆర్టీయూ (PRTU) ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో హెచ్చరించారు. గురువారం నల్గొండ పట్టణంలోని జీఎం గార్డెన్లో పీఆర్టీయూ రాష్ట్ర కౌన్సిల్ 6వ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు పుల్గం దామోదర్ రెడ్డి అధ్యక్షతన అట్టహాసంగా ప్రారంభమైంది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ.. పీఆర్సీ సాధన, పెండింగ్ బిల్లుల తక్షణ విడుదల, సీపీఎస్ విధానం రద్దు, ఈహెచ్ఎస్ లోపాల సరిదిద్దడం, గురుకుల, కేజీబీవీ, మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం శాసనమండలిలో వందల సార్లు గొంతు విప్పానని తెలిపారు. ముఖ్యమంత్రి దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సెప్టెంబర్ 1న ఇందిరాపార్కు వద్ద 35 వేల మందితో ధర్నా చేశామని, అయినా స్పందించకపోతే త్వరలోనే ప్రత్యక్ష భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
రాబోయే వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సుంకరి బిక్షం గౌడ్ను పీఆర్టీయూ (PRTU) అధికారిక అభ్యర్థిగా ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి ప్రకటించారు. ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్లు నిరుద్యోగుల సమస్యల సాధన కోసం చట్టసభలలో మరొక బలమైన గొంతుక అవసరమని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి, పీఆర్టీయూ అధికార ప్రతినిధి వంగ మహేందర్ రెడ్డి, క్రమశిక్షణ సంఘం చైర్మన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ రాష్ట్ర అధ్యక్షులు పేరి వెంకటరెడ్డి, గుండు లక్ష్మణ్, జగన్మోహన్ గుప్త, నల్గొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కాళం నారాయణరెడ్డి, మేకల జానారెడ్డితో పాటు వివిధ జిల్లాల, మండలాల నాయకులు, ఉపాధ్యాయులు వేలాదిగా పాల్గొన్నారు.

