ఫోర్ సీజన్స్ రెస్టారెంట్​కు నోటీసులు!

కలం, జడ్చర్ల: జడ్చర్ల (Jadcherla)లోని ఫోర్​ సీజన్స్​ రెస్టారెంట్ (Four Seasons Restaurant)​కు మున్సిపల్​ అధికారులు గురువారం నోటీసులు జారీ చేశారు. ప్రజారోగ్య పరిరక్షణ, పరిశుభ్రత ప్రమాణాల అమలులో భాగంగా ఈ చర్యలు చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ గిరీష్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ శివశంకర్ మున్సిపల్ సిబ్బంది గురువారం కర్నూల్ రోడ్, ఎన్ హెచ్-44 వద్ద ఉన్న ఫోర్ సీజన్స్ రెస్టారెంట్ అండ్ మండి​లో తనిఖీలు నిర్వహించారు. రెస్టారెంట్​ లోపల పరిస్థితులను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు.

తనిఖీల్లో గుర్తించిన లోపాలు..

అధికారుల తనిఖీల్లో వంటగది అపరిశుభ్రంగా ఉండటం, మురుగునీటి సమస్య, ఆహార పదార్థాల నిల్వలో లోపాలను గుర్తించారు. అలాగే ఆహారంలో అవాంఛిత పదార్థాలు, గడువు ముగిసిన ఆహార ఉత్పత్తులు, రిఫ్రిజిరేటర్‌లో ఎక్కువ కాలం నిల్వ ఉంచిన మాంసాన్ని అధికారులు గుర్తించారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, వినియోగానికి అనర్హమైనవిగా గుర్తించిన పదార్థాలను మున్సిపల్ సిబ్బంది తొలగించి పారవేశారు.

రెస్టారెంట్ యాజమాన్యానికి నోటీసులు

రెస్టారెంట్ వంటగదిని శుభ్రపర్చాలని, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని, ఆహార పదార్థాలను పరిశుభ్రమైన పరిస్థితుల్లో నిల్వ చేయాలని, గడువు ముగిసిన పదార్థాలను వెంటనే తొలగించాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశించారు. భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) నిర్దేశించిన వర్తించే నిబంధనలు, పరిశుభ్రత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. గుర్తించిన లోపాలను సరిదిద్ది 48 గంటల్లోగా అమలు నివేదిక సమర్పించాలని రెస్టారెంట్ యాజమాన్యానికి నోటీసు జారీ చేశారు. నోటీసులో పేర్కొన్న రూ.10,000 జరిమానాకు సంబంధించి వర్తించే చట్టపరమైన నిబంధనల ప్రకారం చర్యలు నిర్ధారించబడతాయి. లోపాలు సరిదిద్దకపోతే లేదా తిరిగి ఉల్లంఘనలు జరిగితే చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ సందర్భంగా కమిషనర్ గిరీష్ మాట్లాడుతూ.. హోటళ్లు, రెస్టారెంట్లు పరిశుభ్రత, సురక్షిత ఆహార నిర్వహణ, సరైన నిల్వ పద్ధతులను పాటించడం ప్రజారోగ్య పరిరక్షణకు అత్యంత ముఖ్యమని తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని ఆహార వ్యాపార సంస్థల్లో తనిఖీలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలు పరిశుభ్రత ప్రమాణాలను పాటిస్తూ, ప్రజలకు సురక్షితమైన ఆహారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>