కలం, జగిత్యాల: వివిధ వర్గాలకు, సంస్థలను రక్షించడానికి ఉన్నటువంటి రక్షణ చట్టాలను జర్నలిస్టులకు సైతం వర్తింపజేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జర్నలిస్ట్ నాయకులు కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట ఎస్ఐ శ్రీకాంత్ ఇద్దరు రిపోర్టర్లు శేఖర్, సంపత్ లపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడాన్ని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (TWJF) రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.
పోలీసుల అధికార దుర్వినియోగం, లంచాల వసూళ్లపై వార్తలు రాసినందుకే కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం దారుణమని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ, ప్రజాస్వామ్యంలో నాల్గవ స్తంభంగా ఉన్న విలేకరుల పట్ల సదరు ఎస్ఐ వ్యవహరించిన తీరు క్షమించరానిదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేవలం ఎస్ఐని ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేయడం పరిష్కారం కాదని, పోలీసు ఉన్నతాధికారులు ఈ ఘటనపై లోతైన విచారణ జరిపి, బాధ్యుడైన ఎస్ఐపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని కిషన్ రెడ్డి కోరారు.

