కలం, వెబ్ డెస్క్: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు (Supreme Court) ఈ రోజు విచారణ జరపబోతుంది. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇతర నేతలు ఈ పిటిషన్లు వేయగా.. కోర్టు విచారణకు స్వీకరించింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఆధ్వర్యంలోని ధర్మాసనం వాదనలు వినబోతుంది.
సర్ ప్రక్రియ రాజ్యాంగ విరుద్ధమని, ఉద్దేశపూర్వకంగా ఓట్లు తొలగిస్తున్నారంటూ పిటిషన్లో రాహుల్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి పలు రాష్ట్రాల్లో జరిగిన ఓట్ల తొలగింపు ఆధారాలను పిటిషన్లకు జత చేశారు. ఇప్పటికే సర్ ప్రక్రియను సమర్థించిన సుప్రీం కోర్టు.. అందులో తప్పులు దొర్లితే మాత్రం తాము జోక్యం చేసుకుంటామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
చట్టంపై విచారణకు అంగీకారం..
కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్, ఇద్దరు కమిషనర్లకు సివిల్, క్రిమినల్ కేసుల నుంచి రక్షణ కల్పిస్తూ 2023లో చేసిన చట్టంపై విచారణకు సుప్రీం కోర్టు అంగీకరించింది. త్వరలోనే ఈ కేసు బెంచ్ ముందుకు రానుంది. జడ్జిల కంటే ఎక్కువ రక్షణ ఉందంటూ ఇప్పటికే ఒక సందర్భంలో సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఎన్నికల కమిషనర్లకు ఈ స్థాయి రక్షణ రాజ్యాంగబద్ధమేనా.. లేదా.. అనేది తేల్చబోతుంది.

