కలం, ఆదిలాబాద్ : అధిక లాభాలు, చిట్‌ఫండ్స్, ప్లాట్ల కేటాయింపు పేరుతో ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడిన యూనిక్ సంస్థల కేసు (Unique Companies Investment Fraud)లో ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ రాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్టు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు.
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్, థల్తేజ్ గ్రామానికి చెందిన రాజ్ కుమార్ రాయ్ అనే వ్యక్తి యూనిక్ మర్చంటైల్ ఇండియా లిమిటెడ్, యూనిక్ ఎస్ఎంసీఎస్ సంస్థల పేరుతో వివిధ పెట్టుబడి పథకాలు ప్రవేశపెట్టి, ఏజెంట్ల ద్వారా ప్రజల నుంచి డబ్బులు సేకరించినట్లు విచారణలో వెల్లడైందన్నారు.
గడువు ముగిసినా పెట్టుబడులు, మెచ్యూరిటీ సొమ్ము తిరిగి చెల్లించకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా పరిధిలో సుమారు 2 వేల మంది సభ్యుల ద్వారా రూ.7 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు లావాదేవీలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని తెలిపారు. తెలంగాణలో ఈ సంస్థలకు సంబంధించి 14 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.
బాధితుల నుంచి సేకరించిన సొమ్ముతో బెంగళూరు, పశ్చిమ బెంగాల్, జైపూర్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో హోటళ్లు, హైదరాబాద్ పరిసరాల్లో భూములు, ప్లాట్లు కొనుగోలు చేసినట్లు విచారణలో గుర్తించామన్నారు. తలమడుగు పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసు (Investment Fraud) దర్యాప్తులో భాగంగా మంగళవారం రాత్రి ఆదిలాబాద్ పట్టణంలోని కలెక్టరేట్ చౌక్ వద్ద ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ రాయ్ ను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మరో నిందితుడు చంద్రశేఖర్ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.

