డారిల్ మిచెల్ సంచలన వ్యాఖ్యలు!

కలం, స్పోర్ట్స్ : న్యూజిలాండ్ క్రికెట్‌లో తన తరం సాధించిన విజయాలపై డారిల్ మిచెల్ (Daryl Mitchell) ఆసక్తికరంగా స్పందించాడు. కేన్ విలియమ్సన్ వంటి గొప్ప ఆటగాళ్లతో కలిసి ఆడటం, వారి నుంచి నేర్చుకోవడం తన అదృష్టమని చెప్పాడు. గత దశాబ్దంలో న్యూజిలాండ్ క్రికెట్ (New Zealand Cricket) స్థాయి గణనీయంగా పెరిగింది. ఒకప్పుడు అండర్‌డాగ్‌గా కనిపించిన జట్టు.. మూడు ఫార్మాట్లలోనూ బలమైన జట్టుగా ఎదిగింది. ఈ ప్రయాణంలో తాను భాగం కావడం చాలా ప్రత్యేకమని మిచెల్ పేర్కొన్నాడు.

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ విజయం న్యూజిలాండ్‌కు కీలక ఘట్టంగా నిలిచింది. 2021లో సౌతాంప్టన్‌లో భారత్‌పై జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అంతేకాదు.. ప్రపంచ స్థాయిలో జరిగిన వైట్‌బాల్ టోర్నీల్లోనూ న్యూజిలాండ్ ఫైనల్స్‌కు చేరింది. కొన్ని ఫైనల్స్‌లో ఓటమి ఎదురైనా, ఆ అనుభవాలు ఎంతో విలువైనవని మిచెల్ అభిప్రాయపడ్డాడు. తన వ్యక్తిగత ప్రయాణంలోనూ ఈ తరం ఆటగాళ్ల ప్రభావం ఉందని చెప్పాడు. ముఖ్యంగా కేన్ విలియమ్సన్ వంటి ఆటగాళ్ల నుంచి చాలా నేర్చుకున్నట్లు తెలిపాడు.

ఇటీవల భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోనూ మిచెల్ కీలక పాత్ర పోషించాడు. 2026 జనవరి 18న ఇండోర్‌లో జరిగిన మూడో వన్డేలో 137 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌తో న్యూజిలాండ్ భారత గడ్డపై తొలిసారి ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ను గెలుచుకుంది. తాను ఉన్న ఈ తరం ఆటగాళ్లు ప్రపంచ వేదికపై ఎన్నో గొప్ప విజయాలు సాధించారని మిచెల్ గుర్తు చేసుకున్నాడు. భవిష్యత్ తరాలు కూడా న్యూజిలాండ్ క్రికెట్ విజయాలను కొనసాగించాలని ఆకాంక్షించాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>