కలం, నిర్మల్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చి భావితరాలకు అందించాలని సిపిఐ నాయకులు (CPI Leaders) డిమాండ్ చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 78వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని కురాన్నపేట్(Kurannapet) శివారులో ఉన్న వెయ్యి ఉరుల మర్రి స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకుడు భూక్య రమేష్ మాట్లాడుతూ.. భూస్వామ్య, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణలో సాగిన రైతాంగ సాయుధ పోరాటం చారిత్రక ఘట్టమని అన్నారు. ఈ పోరాట ఫలితంగా లక్షలాది ఎకరాల భూమిని పేదలకు పంచిన ఘనత సిపిఐకి దక్కుతుందని పేర్కొన్నారు.
చారిత్రక వాస్తవాలను పక్కనపెట్టి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించడం సరికాదన్నారు. వాస్తవ చరిత్రను ప్రజలకు, ముఖ్యంగా యువతకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. అలాగే సెప్టెంబర్ 17ను తెలంగాణ విలీన దినోత్సవంగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు.

