హర్షిత్ రాణాకు భారీ షాక్.. రెండు సిరీస్‌లకు దూరం!

కలం, స్పోర్ట్స్​ : భారత ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా (Harshit Rana)కు మరోసారి గాయం షాక్ ఇచ్చింది. అఫ్గానిస్తాన్‌తో జరిగే టీ20 సిరీస్‌తో పాటు 2026 ఆసియా గేమ్స్‌కు కూడా అతడు దూరమయ్యాడు. అతడి స్థానంలో విదర్భ పేసర్ యశ్ ఠాకూర్‌ను ఎంపిక చేశారు. సెప్టెంబర్ 7న మ్యాచ్ సిమ్యులేషన్‌లో బౌలింగ్ చేస్తున్న సమయంలో హర్షిత్ రాణాకు రెక్టస్ ఫెమోరిస్ స్ట్రెయిన్‌ అయింది. దీంతో రాబోయే రెండు టోర్నీల నుంచి అతడిని తప్పించారు. రాణాకు గాయాలు కొత్త కాదు. ఈ ఏడాది ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో అతడు జట్టుకు దూరమయ్యాడు.

ఆ తర్వాత 2026 టీ20 ప్రపంచకప్‌కు ముందు దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో మోకాలికి గాయమైంది. ఆ గాయం కారణంగా ప్రపంచకప్‌కు కూడా రాణా దూరమయ్యాడు. ఆ తర్వాత శస్త్రచికిత్స చేయించుకున్నాడు. దీంతో 2026 ఐపీఎల్‌లోనూ ఆడలేకపోయాడు. రీహాబిలిటేషన్ పూర్తి చేసుకున్న తర్వాత రాణాను మళ్లీ భారత జట్టు ప్రణాళికల్లోకి తీసుకున్నారు. జూన్ 20న చెన్నైలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడో వన్డే కోసం జట్టులోకి తీసుకున్నారు. అయితే తాజా గాయం అతడి పునరాగమనానికి మరోసారి బ్రేక్ వేసింది.

రాణా స్థానంలో యశ్ ఠాకూర్‌ (Yash Thakur)కు అవకాశం దక్కింది. అఫ్గానిస్తాన్ టీ20 సిరీస్‌తో పాటు ఆసియా గేమ్స్ జట్టులోనూ అతడికి చోటు కల్పించారు. 27 ఏళ్ల యశ్ ఠాకూర్ ఇటీవలే భారత్ తరఫున టీ20 అరంగేట్రం చేశాడు. జింబాబ్వే పర్యటనలో రెండు మ్యాచ్‌లు ఆడి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. దేశవాళీ టీ20ల్లోనూ ఠాకూర్‌కు మంచి రికార్డు ఉంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 50 మ్యాచ్‌లు ఆడి 81 వికెట్లు పడగొట్టాడు. అతడి ఎకానమీ రేట్ 7.04గా ఉంది.

అఫ్గానిస్తాన్‌తో భారత్ మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. మూడు మ్యాచ్‌లు ఢిల్లీలోనే జరుగుతాయి. ఈ సిరీస్ తర్వాత భారత జట్టు 2026 ఆసియా గేమ్స్‌పై దృష్టి పెట్టనుంది. సెప్టెంబర్ 18న ఢిల్లీ నుంచి జట్టు బయలుదేరనుంది. అఫ్గానిస్తాన్ టీ20 సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా ఉంటాడు. ఆసియా గేమ్స్ జట్టుకు కూడా శ్రేయస్ అయ్యరే కెప్టెన్. తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

రాణా (Harshit Rana) గైర్హాజరీతో భారత పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు ఇప్పుడు యశ్ ఠాకూర్‌కు అవకాశం దక్కింది. తాజా గాయం కారణంగా రాణా ఈ రెండు కీలక అసైన్‌మెంట్లకు దూరమయ్యాడు. అతడి స్థానాన్ని యశ్ ఠాకూర్ భర్తీ చేయనున్నాడు.

Also Read : పాకిస్థాన్‌పై భారత్ 19-0తో ఘనవిజయం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>