కలం, స్పోర్ట్స్: ఇంగ్లండ్ టూర్‌లో పాకిస్థాన్ క్రికెట్ పరిస్థితిపై మాజీ కెప్టెన్ అజర్ అలీ ( Azhar Ali ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. వరుస ఓటములు, జట్టులో భారీ మార్పులపై ఆందోళన వ్యక్తం చేశాడు. పాకిస్థాన్ ఇప్పుడు ప్రతికూలంగా మాత్రమే స్థిరంగా మారిందని అన్నాడు. హెడ్డింగ్లీ, లార్డ్స్ టెస్టుల్లో ఓటముల తర్వాత హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్‌ను తప్పించారు. ఏడుగురు ఆటగాళ్లను స్వదేశానికి పంపించారు. ఈ నిర్ణయాలపై షాహిద్ అఫ్రిది, మిస్బా ఉల్ హక్ కూడా విమర్శలు చేశారు. సీనియర్ సెలెక్టర్ అక్బ్ జావెద్‌పై అజర్ విమర్శలు చేశాడు.
జట్టు వైఫల్యాలకు ఆయన బాధ్యత తీసుకోవాలని సూచించాడు. కెప్టెన్ బాబర్ అజమ్‌కు కూడా అజర్ మద్దతు తెలిపాడు. ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్థాన్‌కు కెప్టెన్‌గా ఉండటం చాలా కష్టమని అన్నాడు. వరుస విమర్శలు బాబర్‌పై మానసిక ప్రభావం చూపాయని పేర్కొన్నాడు. పాక్ క్రికెట్‌ను గాడిలో పెట్టేందుకు దీర్ఘకాలిక ప్రణాళిక అవసరమని అజర్ చెప్పాడు. ఆటగాళ్లు, కోచ్‌లకు కనీసం మూడు, నాలుగేళ్లు సమయం ఇవ్వాలని సూచించాడు. తక్షణ మార్పులతో సమస్య పరిష్కారం కాదని స్పష్టం చేశాడు.

