కలం, ఖమ్మం బ్యూరో : తనకు రాజకీయంగా, వ్యక్తిగతంగా జన్మనిచ్చిన అశ్వారావుపేట నేల రుణం తీర్చుకునేందుకు, ఈ ప్రాంత రూపురేఖలను సమూలంగా మార్చడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) స్పష్టం చేశారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట (Aswaraopeta) నియోజకవర్గ పర్యటనలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి ఆయిల్ ఫెడ్ డివిజనల్ కార్యాలయంలో రైతులకు ఆయిల్ పామ్ మొక్కలను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం నూతనంగా నిర్మించనున్న పామాయిల్ ఫ్యాక్టరీ స్థలాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. సీతారామ ప్రాజెక్టు (Sitarama Project) ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వరప్రదాయనిగా మారిందని, రాజీవ్ కెనాల్ ద్వారా సాగునీటికి పూర్తి భరోసా వచ్చిందని తెలిపారు. దమ్మపేట, అశ్వారావుపేట మండలాలలో ప్రతి ఎకరానికి గోదావరి జలాలను తెచ్చే బాధ్యతను తానే స్వయంగా తీసుకుంటానని ప్రకటించారు. ఇప్పటికే పైప్‌లైన్ల ద్వారా 36 చెరువులను నీటితో నింపినట్లు గుర్తుచేశారు. పంట పొలాలు దెబ్బతినకుండా కాలువలు, పైప్‌లైన్ల నిర్మాణానికి రైతులు సహకరిస్తే ముఖ్యమంత్రితో మాట్లాడి మరిన్ని నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.
రైతులు ఎంత పరిమాణంలో పంట పండించినా కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఆయిల్ పామ్ సాగుదారులు ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. ప్రస్తుతం దేశంలో వంటనూనెల దిగుమతుల కోసం రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా 70 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు చేపడితే స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా ఎగుమతులు కూడా పెంచవచ్చని తెలిపారు. రైతుల సంక్షేమం, పామాయిల్ మద్దతు ధరలపై చర్చించేందుకు ఈ నెల 18న హైదరాబాద్‌లో ‘దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రుల సదస్సు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రాంతీయ అనుసంధానతను పెంచేందుకు రవాణా వ్యవస్థను విస్తరిస్తున్నామని మంత్రి తుమ్మల (Minister Tummala) తెలిపారు. ఖమ్మం నుంచి అశ్వారావుపేట మీదుగా జంగారెడ్డి గూడెం వరకు 4 లేన్ల రహదారి నిర్మాణానికి డిపిఆర్ వేగంగా సిద్ధమవుతోందని, ఏలూరు నుంచి భద్రాచలం వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని కేంద్ర మంత్రిని కోరినట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులతో ప్రాంతీయ రహదారులకు మహర్దశ పట్టబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read : రూ.40 కోట్లతో సీఎం సోదరుడికి భద్రత: హరీశ్ రావు
Follow Us On: Instagram

