సీతారామ ప్రాజెక్టుపై కాంగ్రెస్ నిర్లక్ష్యం.. పువ్వాడ సంచలన ఆరోపణలు

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ఎత్తిపోతల పథకాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం సీరియస్‌గా తీసుకోకపోవడం వల్లే కాలువలకు గండిపడి తీవ్ర నష్టం వాటిల్లుతోందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండల కేంద్రంలో “పల్లెల్లో విధ్వంసం – పడకేసిన పారిశుధ్యం” పేరుతో బీఆర్ఎస్ చేపట్టిన నిరసన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావులతో కలిసి ఆయన పాల్గొని ప్రసంగించారు.

​కేసీఆర్ (KCR) హయాంలో 90 శాతం పూర్తయిన సీతారామ ప్రాజెక్టు కాలువల లైనింగ్ పనులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడమే కాకుండా, కృష్ణా-గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాలను పక్కనబెట్టి పక్క రాష్ట్ర ప్రయోజనాలకు లబ్ధి చేకూరుస్తోందని పువ్వాడ (Puvvada Ajay) ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన దొంగ గ్యారెంటీలను నమ్మి ప్రజలు మోసపోయారని, రూ. 2 లక్షల రైతు రుణమాఫీ పూర్తిస్థాయిలో చేయకుండా దగా చేశారని మండిపడ్డారు. గతంలో 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తే, నేడు 7 గంటలు కూడా సరిగా ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోయి రైతులు గోస పడుతున్నారని, యూరియా కోసం యాప్‌లు, ఓటీపీల పేరుతో తిప్పలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

​అలాగే మహాలక్ష్మి, ఆసరా పింఛన్లు, నిరుద్యోగ భృతి, ఆటో డ్రైవర్ల సాయం వంటి ఏ ఒక్క హామీ నెరవేరలేదని విమర్శించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, శక్త్యంశ లాంటి కేసీఆర్ త్వరలోనే సింహంలా తిరగబడి కాంగ్రెస్ మోసాలను ఎండగడతారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి, ఆర్‌జేసీ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Also Read : “పంట కుంటలు” రైతులను ఆదుకునే అమృత భాండాలు!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>