గురువులను గౌరవించడం మనందరి బాధ్యత: ఎస్పీ జానకి

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: గురువులే సమాజానికి మార్గదర్శకులని వారి అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నత శిఖరాలకు ఎదగాలని జిల్లా ఎస్పీ జానకి (SP Janaki) ఆకాంక్షించారు. గురుపూజోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం పరిధిలోని పోలీస్ లైన్ హై స్కూల్‌లో శనివారం ఘనంగా గురుపూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డి. జానకి ముఖ్య అతిథిగా హాజరై పాఠశాలలోని ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయులందరికీ శాలువాలు కప్పి, పుష్పగుచ్చాలు అందజేసి గురుపూజోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. “గురువులను గౌరవించుకోవడం, వారి సేవలను స్మరించుకోవడం మనందరి బాధ్యత. తల్లిదండ్రుల తర్వాత పిల్లలకు విద్యాబుద్ధులు, క్రమశిక్షణ, నైతిక విలువలు నేర్పించి వారి భవిష్యత్తుకు బాటలు వేసేది గురువులే అని ఆమె కొనియాడారు. ఒక మంచి విద్యార్థిని మంచి పౌరుడిగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకం. గురువు చూపించే మార్గదర్శకత్వం విద్యార్థి జీవితంపై జీవితాంతం ప్రభావం చూపుతుంది. అందుకే గురువులను పూజించుకోవడం, గౌరవించుకోవడం మన సంస్కృతిలో ఎంతో విశిష్టమైన సంప్రదాయం” అని ఎస్పీ అన్నారు.

విద్యార్థుల్లో క్రమశిక్షణ, దేశభక్తి, సామాజిక బాధ్యత, నైతిక విలువలను పెంపొందించడంలో ఉపాధ్యాయులు మరింత చురుకైన పాత్ర పోషించాలని ఎస్పీ సూచించారు. ప్రస్తుత సమాజంలో విద్యార్థులు సాంకేతికతను విస్తృతంగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో వారిని సైబర్ నేరాల పట్ల అప్రమత్తం చేయాలని తెలిపారు. అనంతరం జిల్లా ఎస్పీ సైబర్ నేరాలపై ఉపాధ్యాయులు, అధ్యాపకులు, పాఠశాల సిబ్బందికి అవగాహన కల్పించారు. ఆన్‌లైన్ మోసాలు, ఫేక్ లింకులు, ఓటిపి మోసాలు, నకిలీ ఉద్యోగ/ఇన్వెస్ట్‌మెంట్ ఆఫర్లు, సోషల్ మీడియా మోసాలు తదితర సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని, ఆలస్యం చేయకుండా స్పందించడం ద్వారా ఆర్థిక నష్టాన్ని నివారించే అవకాశం ఉంటుందని వివరించారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎన్.బి. రత్నం, ఏఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్, పాఠశాల ప్రధాన అధ్యాపకులు మహమ్మద్ సజీద్ హుస్సేన్, ఆర్‌ఐలు కృష్ణయ్య, నగేష్, ఇతర పోలీసు అధికారులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>