కలం, స్పోర్ట్స్: కరీబియన్ ప్రిమియర్ లీగ్‌లో శ్రీలంక ఆల్ రౌండర్ దాసున్ శనక (Dasun Shanaka) చరిత్ర సృష్టించాడు. కేవలం 39 బంతుల్లోనే సెంచరీ బాది సీపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన శతకం నమోదు చేశాడు. గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ ప్యాట్రియాట్స్ జట్టు 137 పరుగుల భారీ తేడాతో సెయింట్ లూసియా కింగ్స్‌ను ఓడించింది. ఈ ఘన విజయంతో ప్యాట్రియాట్స్ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
24 బంతుల్లోనే అర్ధ సెంచరీ..
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ప్యాట్రియాట్స్ జట్టుకు ఆండ్రీ ఫ్లెచర్ 64 పరుగులతో మంచి పునాది వేశాడు. జట్టు స్కోరు 89 పరుగుల వద్ద ఉన్నప్పుడు శనక క్రీజులోకి వచ్చీ రాగానే రోస్టన్ చేజ్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత 24 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. చివరి ఓవర్లలో శనక రెచ్చిపోయాడు. మహీష్ తీక్షణ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టాడు. కియాన్ గ్యాస్టన్ వేసిన ఆఖరి ఓవర్లో నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్‌తో ఏకంగా 28 పరుగులు పిండుకున్నాడు. వనిందు హసరంగతో కలిసి 31 బంతుల్లోనే 93 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 43 బంతుల్లో 8 ఫోర్లు, 12 సిక్సర్లతో 121 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడంతో..
ప్యాట్రియాట్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లకు 235 పరుగుల భారీ స్కోరు చేసింది. 236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సెయింట్ లూసియా కింగ్స్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయింది. కెమిల్ పూరన్ పరుగులేమీ చేయకుండానే తొలి ఓవర్లోనే అవుటయ్యారు. హసరంగ రెండు వికెట్లు తీసి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు. టిమ్ సీఫెర్ట్ 50 పరుగులతో కొంతపోరాటం చేసినా, మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు.
లూయిస్ అద్భుత ప్రదర్శన..
ప్యాట్రియాట్స్ బౌలర్ జెరెమియా లూయిస్ తన 10వ టీ20 మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శన చేశారు. వరుస బంతుల్లో చేజ్, ఫోర్డ్‌లను అవుట్ చేయడమే కాకుండా, చివరి ఆరు వికెట్లలో ఐదు వికెట్లు తీసి తన తొలి ఐదు వికెట్ల ప్రదర్శనను నమోదు చేశారు. లూయిస్ ధాటికి కింగ్స్ జట్టు 13.5 ఓవర్లలో 98 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయం ప్యాట్రియాట్స్ నెట్ రన్ రేట్‌ను బాగా మెరుగుపరిచింది. అలాగే పాయింట్ల పట్టికలో ఐదో స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. సీపీఎల్ చరిత్రలో ప్యాట్రియాట్స్ జట్టుకు పరుగుల పరంగా ఇది అతి పెద్ద విజయం. లీగ్‌లో ముందుకు సాగేకొద్దీ టోర్నమెంట్ రేసు మరింత ఆసక్తికరంగా మారనుంది.

