కలం, తెలంగాణ బ్యూరో: ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీతోనే కొనసాగుతా, ఎమ్మెల్యేగానూ ఉంటా.. అని కొండా సురేఖ (Konda Surekha) చెప్తున్నప్పటికీ భవిష్యత్తులో రాజీనామా చేస్తే జరిగే ఉప ఎన్నిక మాత్రం ఖరీదైనదిగానే ఉండే అవకాశమున్నది. కొండా సురేఖ వరంగల్ ఈస్ట్ (Warangal East) నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైతే కాంగ్రెస్ అభ్యర్థిగా బసవరాజు సారయ్య (Baswaraju Saraiah) పోటీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆ పదవీ కాలం నవంబరుతో పూర్తవుతుంది.
గతంలో మంత్రిగా పనిచేసిన బసవరాజు సారయ్య(Baswaraju Saraiah)కు ఉమ్మడి వరంగల్ జిల్లాలో బలమైన గుర్తింపే ఉన్నది. ఒకవేళ ఇక్కడ ఉప ఎన్నిక తప్పనిసరి అయిన పక్షంలో గెలుపు అటు కొండా సురేఖ ఫ్యామిలీకి, ఇటు కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకం కానున్నది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక తరహాలో అన్ని పార్టీలూ భారీ స్థాయిలోనే సమయాన్ని, ఎనర్జీని, డబ్బును వెచ్చించక తప్పదు. ఎమ్మెల్యే పదవికి కొండా సురేఖ రాజీనామా విషయంలో నిర్ణయం తీసుకోలేకపోవడానికి ఖర్చుతో పాటు గెలుపోటములు కూడా కారణమని జిల్లాలో చర్చ మొదలైంది.
ఛాలెంజ్‌గా తీసుకోనున్న సీఎం
– ఏ ఎన్నిక అయినా స్వయంగా తానే పోటీ చేస్తున్నాననే భావనతో ప్రచారంలోకి దూకుతానని పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. కచ్చితంగా గెలిచి తీరాలన్న పట్టుతో పనిచేస్తానని అన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా ఇదే అంశాన్ని స్పష్టం చేసి, స్వయంగా ఎన్నికల క్యాంపెయిన్ నిర్వహించారు.
– అంతకుముందు ఎంపీ ఎన్నికల్లో సైతం స్టార్ క్యాంపెయినర్‌గా బాధ్యతలు సీఎం తీసుకున్నారు.
– భవిష్యత్తులో కొండా సురేఖ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే వరంగల్ ఈస్ట్ (Warangal East) నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికను సైతం సీఎం ఛాలెంజ్‌గానే తీసుకోనున్నారు. స్వయంగా ఆయనే రంగంలోకి దిగి ప్రచారం చేసే అవకాశాలు లేకపోలేదు.
– ఎట్టి పరిస్థితుల్లో అక్కడ కాంగ్రెస్ గెలిచి తీరాల్సిందేననే పట్టుదలతో పార్టీ యంత్రాంగాన్ని మొత్తం మోహరించే అవకాశాలూ లేకపోలేదు. వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో బీసీ, మైనారిటీ ఓటు బ్యాంకు కీలకమైన పరిస్థితుల్లో ‘బీసీ కార్డు’ ప్రయోగించి అభ్యర్థిని గెలిపించుకునేందుకు స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగే చాన్స్ ఉంది.
అధికార పార్టీని కొండా ఫ్యామిలీ ఢీకొనగలదా?
ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాను శాసించగలిగిన స్థాయిలో ఉన్న కొండా సురేఖ-మురళి (Konda Surekha – Murali) ఫ్యామిలీ ఇప్పుడు నియోజకవర్గానికే పరిమితమైందనే జనరల్ టాక్ జిల్లాలో వినిపిస్తున్నది. అధికారంలో ఉన్న పార్టీని ఢీకొట్టగలిగేంతగా ఆర్థిక, అంగబలాన్ని సమకూర్చుకోవడం కొండా ఫ్యామిలీకి కష్టమేనన్నది స్థానికుల వాదన.
జూబ్లీహిల్స్ స్థానం బీఆర్ఎస్‌కు సిట్టింగ్ అయినప్పటికీ కాంగ్రెస్‌తో తలపడలేకపోయిందని, చేజార్చుకోక తప్పలేదని, ఇప్పుడు వరంగల్ ఈస్ట్ నియోజకవర్గ ఉప ఎన్నిక జరిగితే కూడా జూబ్లీహిల్స్ బైపోల్ తరహాలో ఉంటుందని, అధికార పార్టీని ఢీకొనేంత శక్తిని సమకూర్చుకోవడం కొండా ఫ్యామిలీకి కష్టమేననే మాటలూ వినిపిస్తున్నాయి. దీన్ని గ్రహించినందునే, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయను.. కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టను.. అంటూ కొండా సురేఖ చెప్పాల్సి వచ్చిందని స్థానిక నేతలు అంటున్నారు.
Also Read : మంత్రులుగా ఆ ఇద్దరు?
Follow Us On: X(Twitter)

