కలం, స్పోర్ట్స్: అభిమానుల ఆగ్రహానికి హాంప్‌షైర్ (Hampshire) క్రికెట్ వెనక్కి తగ్గింది. న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ స్కాట్ కుగ్గెలెయిన్ (Scott Kuggeleijn) తమ తరఫున ఆడబోరని క్లబ్ ఇవాళ ప్రకటించింది. 34 ఏళ్ల కుగ్గెలెయిన్ను వార్విక్షైర్ (Warwickshire) తో మ్యాచ్ కోసం ప్రకటించిన 15 మంది జట్టులో హాంప్‌షైర్ చేర్చింది. అయితే, అతడిని ఓవర్సీస్ ఆటగాడిగా తీసుకున్నట్లు క్లబ్ ముందుగా అధికారికంగా ప్రకటించలేదు. ఈ నిర్ణయంపై అభిమానులు తీవ్రంగా స్పందించారు. కుగ్గెలెయిన్ ఎంపికను తప్పుబట్టారు. క్లబ్ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించారు.
కుగ్గెలెయిన్ గతంలో లైంగిక దాడి, అత్యాచారం ఆరోపణల కేసును ఎదుర్కొన్నాడు. 2015లో ఈ కేసు నమోదైంది. తొలి విచారణలో జ్యూరీ ఏకాభిప్రాయానికి రాలేదు. రెండో విచారణ తర్వాత అతడు నిర్దోషిగా తేలాడు. అయినప్పటికీ అతడి ఎంపిక గతంలోనూ నిరసనలకు దారితీసింది. అభిమానుల నుంచి వచ్చిన స్పందనను పరిగణనలోకి తీసుకున్నామని హాంప్‌షైర్ తెలిపింది. కుగ్గెలెయిన్ క్లబ్ తరఫున ఆడడని స్పష్టం చేసింది.
ఇక తమ దృష్టి మిగిలిన నాలుగు కౌంటీ ఛాంపియన్షిప్ మ్యాచ్‌లపై ఉంటుందని క్లబ్ పేర్కొంది. ప్రస్తుతం హాంప్‌షైర్ డివిజన్ వన్‌లో చివరి స్థానంలో ఉంది. 10 మ్యాచ్‌ల్లో 86 పాయింట్లు సాధించింది. తొమ్మిదో స్థానంలో ఉన్న లీసెస్టర్‌షైర్ కంటే 16 పాయింట్లు వెనుకబడి ఉంది. వర్షం కారణంగా గ్లామోర్గాన్‌తో మ్యాచ్ డ్రాగా ముగిసిన తర్వాత హాంప్‌షైర్ పరిస్థితి మరింత కీలకంగా మారింది. ఇప్పుడు వార్విక్షైర్తో మ్యాచ్‌తో చివరి దశ పోరాటాన్ని ప్రారంభించనుంది.

