నిర్మల్ డీటీఓ, ఎంవీఐ, ఏఎంవీఐలపై చర్యలుంటాయా?

కలం, నిర్మల్: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు, ఇతర పని దినాల్లో నిర్మల్ (Nirmal) రవాణ శాఖ అధికారులు వంతుల వారీగా విధులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా డీటీఓ, ఎంవీఐ, ఏఎంవీఐలు తరచుగా డ్యూటీలకు డుమ్మా కొడుతున్నారనే విమర్శలున్నాయి. ఇటీవల జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమానికి ముగ్గురు అధికారులు గైర్హాజరైనట్లు సమాచారం. అయితే ఈ గైర్హాజరుకు సంబంధించి ముందస్తుగా సెలవు అనుమతి తీసుకున్నారా? లేదా? అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.

పక్షం రోజులైనా పట్టించుకోరా..

స్వాతంత్ర్య వేడుకలు జరిగి పక్షం రోజులు గడుస్తున్నా.. ముగ్గురు అధికారులు హాజరు కాని విషయం ఇప్పటివరకు శాఖాపరంగా చర్చకు రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అధికారుల గైర్హాజరు అంశాన్ని ఉన్నతాధికారులు పరిశీలించారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ ముందస్తు సెలవు అనుమతి లేకుండానే అధికారిక కార్యక్రమానికి గైర్హాజరై ఉంటే, దీనిపై బాధ్యత ఎవరిది అన్న చర్చ ఉద్యోగ వర్గాల్లో సాగుతోంది.

ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారా?

అధికారిక కార్యక్రమానికి హాజరు కాకపోవడానికి సరైన కారణం లేదని తేలితే.. శాఖాపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముందుగా వివరణ కోరుతారా? లేక నిబంధనల ప్రకారం తదుపరి చర్యలకు ఉపక్రమిస్తారా? అన్నది తేలాల్సి ఉంది. తరచుగా విధులకు డుమ్మా కొడుతుండటంతో  ఉన్నతాధికారులు వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>