ఇంచార్జ్ ప‌ద‌వి తొల‌గింపు.. టీడీపీ నేత క‌న్నీళ్లు!

క‌లం, వెబ్‌డెస్క్‌: పార్టీ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ ప‌ద‌వి నుంచి తొల‌గించ‌డంతో ఓ టీడీపీ నేత కార్య‌క‌ర్త‌ల ముందే క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. చిత్తూరు జిల్లాలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. పుంగ‌నూరు టీడీపీ (Punganur TDP) ఇంచార్జ్‌ను ఇటీవ‌ల పార్టీ అధిష్టానం మార్చింది. చ‌ల్లా రామ‌చంద్రారెడ్డి (Challa Ramachandra Reddy)ని బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించి మ‌ధుసూద‌న్ నాయుడికి ప‌గ్గాలు అప్ప‌గించింది. దీనిపై చ‌ల్లా అనుచ‌రులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గ‌త వైసీపీ హ‌యాంలో పార్టీకి అండ‌గా ఉండి, ఎన్నో కేసులు, వేధింపులు భ‌రిస్తూ వ‌చ్చిన నాయ‌కుడిని ప‌ద‌వి నుంచి ఎలా తొల‌గిస్తార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. రామ‌చంద్రారెడ్డి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి పెద్దిరెడ్డిపై 5 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.

ఎన్నిక‌ల త‌ర్వాత పుంగ‌నూరులో ఏడాదిపాటు పెద్దిరెడ్డిని నియోజ‌క‌వ‌ర్గంలో అడుగు పెట్ట‌నివ్వ‌కుండా నియోజ‌క‌వ‌ర్గంలో కీల‌క ప‌ద‌వుల్లో ఉన్న వైసీపీ నాయ‌కుల‌ను టీడీపీలో చేర్చుకున్నారు. పుంగ‌నూరుకు ఎమ్మెల్యే వైసీపీకి చెందిన వ్య‌క్తి అయినా కూట‌మి ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌న్నీ విజ‌య‌వంతంగా కొనసాగుతున్నాయి. అయితే స్థానికంగా జ‌రుగుతున్న కొన్ని అవినీతి ప‌నుల్లో చ‌ల్లాకు భాగం ఉంద‌ని, ఆయ‌న‌ను ప‌ద‌వి నుంచి త‌ప్పించాల‌ని ప‌లువురు అధిష్టానానికి ఫిర్యాదు చేస్తూ వ‌స్తున్నారు. దీంతో పార్టీ ముఖ్య నేత‌ల చ‌ర్చ‌ల అనంత‌రం నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్‌ను మారుస్తున్న‌ట్లు శ‌నివారం ప్ర‌క‌టించారు.

తాజాగా చ‌ల్లా ఇంచార్జ్ మార్పుపై స్పందించారు. తాను 40 ఏళ్లుగా టీడీపీలోనే ఉన్నాన‌ని, చంద్ర‌బాబు నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉంటాన‌ని వెల్ల‌డించారు. ప‌ద‌వి ఉన్నా, లేక‌పోయినా కార్య‌క‌ర్త‌ల‌కు అండ‌గా ఉంటాన‌ని హామీ ఇచ్చారు. వైసీపీ హ‌యాంలో త‌న‌తో పాటు ఎంతో మంది కార్య‌క‌ర్త‌లు జైలుకు వెళ్లార‌ని గుర్తు చేసుకొని భావోద్వేగానికి గుర‌య్యారు. కార్య‌క‌ర్త‌లు త‌న‌కు ఇచ్చిన మ‌ద్ద‌తు ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేన‌న్నారు. ఎప్పుడైనా త‌న‌ను క‌లిసేందుకు రావొచ్చ‌ని చెప్పారు. కొంద‌రు వ్య‌క్తులు బుర‌ద రాజ‌కీయాలు చేసి నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని క‌లుషితం చేశార‌ని విమ‌ర్శించారు. తాను ఏనాడు చిన్న త‌ప్పు కూడా చేయ‌లేద‌ని అంద‌రి ముందు ప్ర‌మాణం చేశారు. రాజ‌కీయాల్లో స్వార్థం కోసం ఎప్పుడూ ప‌ని చేయ‌లేద‌ని, ప్ర‌జ‌ల కోస‌మే ప‌ని చేశాన‌ని స్ప‌ష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>